Begin typing your search above and press return to search.

పెట్రో బాదుడులో మోడీ సర్కారుకు సరిలేరు ఎవ్వరూ

By:  Tupaki Desk   |   6 Feb 2021 8:00 AM GMT
పెట్రో బాదుడులో మోడీ సర్కారుకు సరిలేరు ఎవ్వరూ
X
ఇంపుగా మాటలు చెప్పు. మొహమాటం లేకుండా బాదేయ్ అన్నట్లు ఉంటుంది మోడీ సర్కారు వారి లెక్క. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు.. యూపీఏ ప్రభుత్వ విధానాల్ని తప్పు పట్టారో.. తాను పవర్లోకి వచ్చిన తర్వాత మోడీ మాష్టారు చేసిందేమిటన్న వాస్తవాన్ని కళ్లు తెరిచి చూస్తే.. గుండెలు అదిరిపోక మానవు. సామాన్యుడికి అచ్చేదిన్ అంటూ మాటలతో స్వర్గాన్ని చూపించే మోడీ మాష్టారు.. చేతల్లో చేసిందేమిటి? అన్న విషయాన్ని జాగ్రత్తగా చూస్తే.. నేతి బీరలో నేతి చందంగా ఉంటుంది.

పెట్రోల్.. డీజిల్ ధరలపై మన్మోహన్ సర్కారును మోడీ తప్పు పట్టేవారు. యూపీఏ తప్పుడు ఆర్థిక విధానాల కారణంగానే ధరలు పెరిగినట్లుగా పదే పదే ఆరోపించిన బీజేపీ.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమిటన్న వాస్తవాన్ని చూసినప్పడు నోటి వెంట మాట రాని పరిస్థితి. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తెలివిగా వ్యవహరించిన తీరు ప్రజల మీద భారీ భారాన్ని మోపింది. అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు తగ్గినప్పుడల్లా.. పెట్రో ధరలు తగ్గేలా మన్మోహన్ సర్కారు పాలసీకి.. మోడీ సర్కారు తనకు తగ్గట్లుగా మార్చుకొని ప్రజలకు షాకిచ్చింది.

అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధర తగ్గిన ప్రతిసారీ.. ఎక్సైజ్ డ్యూటీని పెంచేయటం ద్వారా ప్రజలకు ఏ మాత్రం ఊరట ఇవ్వని రీతిలో నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ తారకమంత్రం పుణ్యమా అని.. మోడీ సర్కారు పవర్లోకి వచ్చిన 2014 మే నుంచి 2017 సెప్టెంబరు వరకు పెట్రో ధరల్ని పెంచటమే తప్పించి.. తగ్గించే ఆలోచన లేకుండా చేసింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలసిస్ సెల్ గణాంకాల ప్రకారం 2014 మే నుంచి 2017 సెప్టెంబరు మధ్య కాలంలో పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ 54 శాతం పెరిగితే.. డీజిల్ మీద ఏకంగా 154 శాతం పెంచేశారు.

2017 అక్టోబరులో రూ.2 చొప్పున లీటరుకు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించారు. ఈ మాత్రం దానికే మోడీ సర్కారు చెప్పుకున్నదేమిటో తెలుసా? తాము తగ్గించిన రూ.2ల ఎక్సైజ్ డ్యూటీ కారణంగా ఖజానాకు ఏడాదికి రూ.26 వేల కోట్లు నష్టమని పేర్కొన్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఆయా రాష్ట్రాలు పన్ను తగ్గించుకోవాలన్న ఉచిత సలహా ఇచ్చారు. తాము పవర్లోకి వచ్చిన తర్వాత పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ కారణంగా భారీ ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకున్నది కేంద్రమే తప్పించి.. రాష్ట్రాలు కావన్నది మర్చిపోలేం.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 2014-15 చమురు పన్నుల రూపంలో మోడీ సర్కారు రూ.99వేల కోట్లు ఆదాయాన్ని సమకూర్చుకుంటే.. 2016-17లో ఏకంగా రూ.2.42లక్షల కోట్ల మొత్తాన్ని ఆర్జించింది. ఇక్కడితో ఆగని మోడీ సర్కారు 2020 మార్చిలో ఒక చట్టసవరణ చేసింది. దీని ప్రకారం పెట్రోల్.. డీజిల్ పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని గరిష్ఠంగా రూ.10.. డీజిల్ లీటరుపై రూ.4 మాత్రమే పెంచే వీలుంది. ఈ చట్టాన్ని మార్చారు. కొత్తగా చేసిన సవరణ పుణ్యమా అని.. లీటరు పెట్రోల్ పై రూ.18.. లీటరు డీజిల్ పై రూ.12 చొప్పున పెంచుకునేందుకు వీలుగా చట్టాన్ని మార్చారు. దీనిపై వచ్చిన నిరసనల్ని లైట్ తీసుకున్నారు. ఈ చట్టాన్ని సవరించటానికి ముందు పెట్రోల్.. డీజిల్ పై రూ.3 చొప్పున అదనపు సుంకాన్ని విధించిన కేంద్ర నిర్ణయం కారణంగా ఖజానాకు అదనంగా సమకూరిన ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాల రూ.39వేల కోట్లు. మోడీనా మజాకానా!