Begin typing your search above and press return to search.

మోడీ మాష్టారి బాదుడు.. ఏపీలో లీటరు ‘వంద’ దాటేసిన పెట్రోల్

By:  Tupaki Desk   |   24 May 2021 3:48 AM GMT
మోడీ మాష్టారి బాదుడు.. ఏపీలో లీటరు ‘వంద’ దాటేసిన పెట్రోల్
X
ఏం సిత్రమో ఏమో.. దేశం కోసం ప్రజలు అనునిత్యం త్యాగం చేస్తునే ఉండాలి. అది కూడా సామాన్యులు. నిద్ర లేచింది మొదలు బతుకు పోరుతో కిందామీదా పడే వారి మీదనే భారాలన్ని. అప్రతిహతంగా అంతకంతకూ పెరిగిపోయే పెట్రోల్.. డీజిల్ ధరలు తాజాగా పెంచిన పెంపుతో ఏపీలో లీటరు పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. వాస్తవానికి కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న పాలసీ పుణ్యమా అని.. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ రూ.వంద దాటేసి కొంత కాలమైంది. రెండుతెలుగు రాష్ట్రాలు మాత్రం వంద లోపే ఉంటున్నాయి.

ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరిపోయింది. ఏపీలోని కొన్ని జిల్లాల్లో లీటరు పెట్రోల్ వంద మార్కు దాటేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా కొద్ది నెలలుగా ధరల పెంపునకు విశ్రాంతి ఇచ్చిన చమురు సంస్థలు.. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో లేదో.. వెంటనే బాదేయటం మొదలు పెట్టారు. తాజాగా అది సెంచరీ దాటేసింది. ఆదివారంలీటరు పెట్రోల్ పై 17 పైసలు పెంపుతో చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో లీటరుపెట్రోల్ రూ.100.30కు చేరుకుంది. జిల్లాలోని చిత్తూరు.. ఐరాల.. కుప్పం ప్రాంతాల్లోనే సెంచరీ దాటి సామాన్యులకు షాకిచ్చింది.

ఏపీలోని మరికొన్ని జిల్లాల్లో మాత్రం యాభై పైసలు నుంచి రూపాయి మధ్యలో ఊగిసలాడుతోంది. మహా అయితే రెండు.. మూడు రోజుల్లో వంద దాటేయటం ఖాయమని చెబుతున్నారు. తాజాగా పెరిగిన ధరతో విజయవాడలో లీటరు పెట్రోల్ రూ.99.41 ఉండగా.. అనంతపురంలోరూ.99.25.. ఏలూరులో రూ.99.84.. గుంటూరులో రూ.99.28, కడపలో రూ.98.43, కాకినాడలో రూ.99.57, కర్నూలులో రూ.99.71గా ఉంది. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా మహా అయితే మరో మూడు రోజుల్లో రూ.100 మార్కు దాటేయనుంది. ఏమైనా మోడీ మాష్టారి ఆధ్వర్యంలో దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ.100 మార్కు దాటించిన ఘనతను తన పేరుతో రాయించుకున్నారని చెప్పక తప్పదు.