Begin typing your search above and press return to search.

కరోనాతో జనాలు ఏమైపోనీ.. పెట్రో బాదుడుకు మాత్రం ఆపరేం మోడీ?

By:  Tupaki Desk   |   11 May 2021 8:30 AM GMT
కరోనాతో జనాలు ఏమైపోనీ.. పెట్రో బాదుడుకు మాత్రం ఆపరేం మోడీ?
X
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నో కేంద్ర ప్రభుత్వాల్ని ఈ దేశం చూసింది కానీ.. ప్రజల మూడ్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా.. వారి ఇష్టాయిష్టాల్ని పరిగణలోకి తీసుకోకుండా.. వారి వ్యతిరేకతతో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించే ప్రభుత్వాల్లో మోడీ సర్కారు ముందుండు ఉంటుంది. పన్ను బాదుడుకు సైతం దేశభక్తితో లింకు పెట్టే మోడీ సేన పుణ్యమా అని.. దేశ ప్రజల ఆర్థిక మూలాలు గాయాల పాలైన పరిస్థితి. పెట్రోల్.. డీజిల్ ధరల పెరుగుదల ప్రతి ఒక్క అంశం మీదా ప్రభావితం అవుతుందన్న విషయం తెలిసిందే.

సింఫుల్ గా ఒక్క లెక్కగా చెప్పాలంటే.. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన వేళ లీటరు పెట్రోల్.. డీజిల్ ధరలకు.. ఈ రోజు ఉన్న ధరకు మధ్య వ్యత్యాసాన్ని శాతం రూపంలో తీసుకోండి. అత్యున్నత ఆదాయ వర్గాల్ని వదిలేసి.. పేద.. దిగువ మధ్య తరగతి.. మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతి వర్గాల వారీ వార్షిక ఆదాయాల్లో పెరిగిన శాతాన్ని పోల్చి చూడండి. నూటికి 80 శాతం మంది వరకు పెట్రోల్.. డీజిల్ మీద పెరిగిన పన్ను శాతం కంటే.. వారి వ్యక్తిగత ఆదాయాలు పెరగలేదన్న కఠిన నిజం ఇట్టే అర్థమవుతుంది.

ఈ కారణంగానే.. ఖర్చు పెరగటం.. పొదుపు తగ్గటం లాంటివి ఎక్కువ అవుతున్నాయి. అయినప్పటికి ఇదేమీ పట్టని మోడీ సర్కారు.. పెట్రో బాదుడ్ని రోజువారీగా చేసేసి.. వడ్డనలో కొత్త యాంగిల్స్ చూపిస్తున్న పరిస్థితి. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే.. వాటి కారణంగా తమకు రాజకీయ లబ్థి చేకూరుతుందన్న ఆలోచనలో ఉంటే మాత్రం ఆ కొద్ది నెలలు పాటు ధరల్ని పెంచకుండా జాగ్రత్తలు తీసుకోవటం.. ఆ తర్వాత వడ్డీతో సహా ముక్కు పిండి వసూలు చేయటం అలవాటే.

రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధర తాజాగా పెంచేశారు. లీటరు పెట్రోల్ ధర మీద 27 పైసలు పెరిగితే.. డీజిల్ ధర 36 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో పెట్రోల్ లీటరు రూ.95.13.. డీజిల్ లీటరు రూ.89.47కు పెరిగింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో మరింత పెరుగుదల నమోదైంది. పెరిగిన ధరలతో పెట్రోల్ రూ.97.56.. డీజిల్ ధర లీటరు రూ.91.35కు పెరిగింది. ఇదంతా చూస్తుంటే.. లీటరు పెట్రోల్ ధర రూ.100 మార్కు కొట్టే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పాలి. ఇప్పటికే మహారాష్ట్రతో పాటు.. కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర వంద దాటేసిన ఘనతను మోడీ సర్కారు సొంతం చేసుకుంది.

ఇప్పుడున్న కరోనా కలకలం నేపథ్యంలో పెట్రో ధరల్ని పెంచేందుకు కేంద్రంలోని ఏ సర్కారు సాహసం చేయదు. కానీ.. మోడీ మాష్టారికి అలాంటివేమీ పట్టని వైనం తెలిసిందే కదా. ఈ కారణంతోనే కావొచ్చు.. ఎవరేం అనుకుంటే మాత్రం.. మన బాదాల్సిన బాదుడ్ని మాత్రం ఆపేదే లేదన్నట్లుగా కేంద్రం తీరు ఉంది. పెట్రో పన్ను వడ్డనతో పాటు.. రోజువారీగా పెంచిన ధరల పుణ్యమా అని గత ఆర్థిక సంవత్సరం చివరి పది నెలల్లో రూ.2.94లక్షల కోట్ల పెట్రో పన్ను వసూలు చేయటం గమనార్హం. ఒక్క లీటరు పెట్రోల్ మీద పన్నురూపంలో కేంద్రం ఖాతాకు రూ.34 పోతున్న పరిస్థితి. డీజిల్ మీద అయితే లీటరుకు రూ.32 వరకు పన్నులు వసూలు చేస్తోంది.

వీటికి సెస్సులు అదనంగా. రాష్ట్రాలు వేసే వ్యాట్ అదనం. ఇదంతా కలిపితే.. బొప్పి కట్టేంత భారంగా ప్రజలకు మారుతోంది. కాసుల గలగలకు అలవాటు పడిన కేంద్ర సర్కారు.. సామాన్యుడి ఈతి బాధల్ని మాత్రం పట్టించుకోవటం లేదు. మోడీ సర్కారు తప్పుల్ని ఎత్తి చూపితే.. దేశం మీద ఏ మాత్రం ప్రేమ లేని వ్యక్తిగా మిగిలిపోవటం ఖాయం. అలాంటి వారి కోసమైనా.. మోడీ సర్కారు బాదుడు గురించి కాస్త తక్కువగానే చెప్పాల్సి ఉంటుంది.