Begin typing your search above and press return to search.

జగన్‌ సభలో దర్శకుడి తమ్ముడి ఊర మాస్‌ డైలాగ్స్‌!

By:  Tupaki Desk   |   30 Dec 2022 10:58 AM GMT
జగన్‌ సభలో దర్శకుడి తమ్ముడి ఊర మాస్‌ డైలాగ్స్‌!
X
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నర్సీపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.1600 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు జగన్‌ శంకుస్థాపనలు చేశారు. ఇందులో మెడికల్‌ కాలేజీ కూడా ఉంది. దీన్ని రూ.500 కోట్లతో నిర్మించనున్నారు. అలాగే రూ.470 కోట్లతో తాండవ–ఏలేరు నీటి అనుసంధాన కాల్వలు నిర్మాణం, రూ.16 కోట్లతో నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణ వంటివి ఉన్నాయి.

కాగా నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యేగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ సోదరుడు పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ ఉన్నారు. 2014లో ఇదే నియోజకవర్గం నుంచి ఓటమిపాలైన ఉమాశంకర్‌ 2019లో మాత్రం గెలుపొందారు. కాగా నర్సీపట్నం నుంచి టీడీపీ సీనియర్‌ నేత ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

ఈ నేపథ్యంలో జగన్‌ సభలో స్థానిక ఎమ్మెల్యేగా మాట్లాడిన పెట్ల ఉమాశంకర్‌.. చింతకాయల అయ్యన్నపాత్రుడిపై రెచ్చిపోయారు. ఒక తాగుబోతు నాయకుడు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉండటంతోనే ఈ ప్రాంతానికి ఈ దుస్థితి వచ్చిందంటూ పరోక్షంగా అయ్యన్నపై మండిపడ్డారు. అయిదు సంవత్సరాలు మంత్రిగా పని చేసిన అయ్యన్నపాత్రుడు ట్యాక్స్‌లు తగ్గించలేదని, ఇప్పుడు మళ్లీ తాము అధికారంలోకి వస్తే పన్నులు తగ్గిస్తానని హామీ ఇస్తున్నాడని పెట్ల ఉమాశంకర్‌ నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 25 శాతం పన్నులు తగ్గించారని గుర్తు చేశారు.

నర్సీపట్నం గ్రేడ్‌– 3 మున్సిపాలిటీ అయినందున పన్నులు తగ్గించాలంటూ తాను ఎప్పటి నుంచో కోరుతున్నానని తెలిపారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో అప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు ఏ మాత్రం నర్సీపట్నంను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

సీఎం జగన్‌ తమ ఊరికి రావడంతో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుందని పెట్ల ఉమాశంకర్‌ వ్యాఖ్యానించారు. టీడీపీ పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి, పట్టణం రహదారి, తాండవ–ఏలేరు నీటి అనుసంధాన పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రూ.1600 కోట్లు విలువ చేసే అభివృద్ధి పనులను సీఎం జగన్‌ నర్సీపట్నంకు కేటాయించారని సంతోషం వ్యక్తం చేశారు.

అలాగే తాము ఎన్నికల్లో వైసీపీకి వేయకపోయినప్పటికీ.. జగన్‌ తమకు రూ.3 నుంచి రూ.4 లక్షల రూపాయలను వివిధ సంక్షేమ పథకాల రూపంలో మంజూరు చేశారని టీడీపీ ఓటర్లు సైతం చెబుతున్నారన్నారు. జగన్‌ ను తాము గుండెల్లో పెట్టుకుంటామని.. మరో 30 ఏళ్లు ఆయనే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నామని చెబుతున్నారని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. కులమతవర్గాలకతీతంగా జగన్‌ పరిపాలన సాగిస్తోన్నారని కొనియాడారు.

ఈ సందర్భంగా 2019 ఎన్నికల ప్రచార శంఖారావాన్ని జగన్‌ నర్సీపట్నం నుంచే పూరించినట్లు పెట్ల ఉమాశంకర్‌ గుర్తు చేశారు. అందుకే ఈ నియోజకవర్గానికి 1,600 కోట్ల రూపాయలను మంజూరు చేశారని కొనియాడారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.