Begin typing your search above and press return to search.

బాల‌య్యపై హైకోర్టులో పిటిష‌న్ ప‌డిందండోయ్‌!

By:  Tupaki Desk   |   30 Aug 2017 5:29 AM GMT
బాల‌య్యపై హైకోర్టులో పిటిష‌న్ ప‌డిందండోయ్‌!
X
క‌ర్రూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక దాదాపుగా ముగిసిపోయిన అధ్యాయ‌మే. ఎందుకంటే... అక్క‌డ రెండు నెల‌ల పాటు నెల‌కొన్న హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం ఇప్పుడు చ‌ల్ల‌బ‌డిపోయింది. హోరాహోరీగా సాగిన ఎన్నిక‌ల స‌మ‌రంలో విప‌క్ష వైసీపీ ఇచ్చిన గ‌ట్టి పోటీని ఎదురొడ్డిన అధికార టీడీపీ త‌న స‌ర్వ శ‌క్తులూ ఒడ్డి ఎలాగోలా గ‌డ్డ‌న ప‌డింది. ఈ క్ర‌మంలో టీడీపీ స్టార్ క్యాంపైన‌ర్‌ గా భావిస్తున్న సినీ హీరో - అనంత‌పురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌ను కూడా టీడీపీ అధిష్ఠానం ప్ర‌చారానికి పంపింది. ఓ రోజు పాటు ప్ర‌చారం చేసిన బాల‌య్య‌... త‌న‌దైన స్టైల్లో వివాదంలో చిక్కుకున్నారు.

న‌డిరోడ్డుపై అక్క‌డి ఓట‌ర్ల‌కు న‌గ‌దును పంపిణీ చేస్తున్న బాల‌య్య మీడియా కెమెరాల‌కు అడ్డంగా బుక్క‌య్యారు. దీనిపై వెనువెంట‌నే స్పందిందిన వైసీపీ... ఈ ఉదంతంపై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల సంఘం నుంచి నోటీసు అందుకున్న బాల‌య్య‌.. దానికి స‌మాధాన‌మిస్తూ తాను పంపిణీ చేసింది న‌గ‌దు కాద‌ని - క‌ర‌ప‌త్రాల‌ని తెలిపారు. అంత‌టితో ఆ విష‌యం కాస్తా మ‌రుగున ప‌డిపోయింది. ఇప్పుడు అక్క‌డ ఎన్నిక‌లు ముగియ‌డం - టీడీపీ విజ‌యం సాధించ‌డం జ‌రిగిపోయాయి.

అయితే బాల‌య్య న‌డిరోడ్డుపై న‌గ‌దు పంపిణీ చేస్తూ ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసిన వైనం స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా... అత‌డిపై చ‌ర్య‌లు లేక‌పోతే ఎలాగంటూ వైసీపీ మ‌రోమారు ఈ అంశాన్ని లేవ‌నెత్తింది. ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద ప‌నికాక‌పోవ‌డంతో ఈ సారి నేరుగా తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి హైకోర్టు గ‌డ‌ప తొక్కింది. ఈ మేర‌కు నిన్న వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివ‌కుమార్ హైకోర్టులో ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. న‌డిరోడ్డుపై ప‌ట్ట‌ప‌గ‌లు ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాలకు గురి చేసిన బాల‌య్య పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని ఆయ‌న త‌న పిటిష‌న్‌ లో కోర్టును అభ్య‌ర్థించారు. ఈ పిటిష‌న్‌ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు విచార‌ణ సంద‌ర్భంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌న్న విష‌యంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది.