విశ్వాసానికి ప్రతీకగా శునకాన్ని చెబుతుంటారు. యజమాని పట్ల తన స్వామిభక్తిని ప్రదర్శిస్తూ.. తన ప్రాణాల్ని పణంగా పెట్టిన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. తమిళనాడులోని ట్యూటికూరన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన పలువురిని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
పమేరియన్ జాతికి చెందిన శునకం ఒకటి ఇంటిని కాపాలా కాస్తోంది. అదే సమయంలో ఇంటి ఆవరణలోకి పాము ప్రవేశించింది. దాన్ని గుర్తించిన కుక్క మొరగటం మొదలెట్టింది. ఎంతకూ తన అరుపులు ఆపకపోవటంతో.. ఏం జరిగిందంటూ యజమానురాలు తలుపు తీసింది. అదే సమయంలో పాము ఆమె వైపునకు వెళ్లే ప్రయత్నం చేసింది.
రెప్పపాటులో స్పందించిన శునకం పాముతో పోరాటానికి దిగింది. తనను పలుమార్లు కాటు వేస్తున్నా పట్టించుకోకుండా.. దాంతో పోరాడింది. చివరకు పాము తల కొరికేసి చంపేసింది. అనంతరం పాము కాటుతో ఒళ్లంతా విషం వ్యాపించటంతో చనిపోయింది. పోరాటంలో పడిపోయిన శునకాన్ని తీసుకొని వైద్యుని దగ్గరకు తీసుకెళ్లినా.. అప్పటికే చనిపోయిందని పేర్కొన్నారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారు విస్మయానికి గురి కావటమే కాదు.. తీవ్ర విషాదానికి గురి అవుతున్నారు. తన ప్రాణాల్ని పణంగా పెట్టి.. యజమానిని కాపాడిన శునకం మరోసారి తనకున్న విశ్వాసం ఎంతో చెప్పకనే చెప్పినట్లైంది.