భారత్ పై దాడిచేసిన అనంతరం వాళ్లూ వీళ్లూ స్పందిస్తున్నారు కానీ.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మాత్రం స్పందించింది లేదు సరికదా... ఆ విషయంపై ప్రశ్నించిన ఇండియన్ జర్నలిస్టుని ప్రెస్ మీట్ నుంచి బయటకే పంపించేశాడు. అది భయమా - తప్పుకు తిరిగే తత్వమా అనే విషయాలు కాసేపు పక్కనపెడితే... తాజాగా పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ మాత్రం రెచ్చిపోతున్నాడు. కశ్మీర్ లో ఎవరు దాడిచేసినా, అది పాకిస్థానే అంటున్నారని, పాక్ పై భారత్ కావాలనే విమర్శలు చేస్తుందని నంగనాసి కబుర్లు చెప్పుకొస్తున్నాడు.
కశ్మీర్ లో ఎవరు దాడి చేసిన పాకిస్థాన్ నే బాధ్యులుగా చేయడం భారత్ కు అలవాటైపోయిందని, ఈ విషయంలో భారత్ కావాలనే పాక్ ను విమర్శిస్తుందని చెప్పుకొస్తున్నాడు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్. యూరీ సెక్టార్ లో భారత్ పై దాడికి సంబంధించి మాట్లాడిన ముషార్రఫ్... ఈ సంఘటన విషయమై తమపై భారత్ ఎలాంటి మిలిటరీ చర్యలు తీసుకున్నా.. అందుకు పాక్ సిద్దంగా ఉందని - ఎప్పుడంటే అప్పుడు పాకిస్థాన్ ఎంపిక చేసుకున్న ప్రాంతంలో భారత్ పై దాడులు చేయగలదని హెచ్చరించాడు. పాక్ పై భారత్ మిలటరీ యాక్షన్ తో ప్రతీకారం తీల్చుకోవాల్సిందే అంటున్న వారంతా జరుగుతున్న పరిణామాలు ఏమిటో అర్థం చేసుకుంటే మంచిదంటూ వ్యాఖ్యానించాడు.
ఇదే సందర్భంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల వద్ద ఆయుధాలు - పేలుడు సామాగ్రి - ఉపయోగించిన వస్తువులన్నీ పాక్ నుంచే వచ్చినట్లు ఆధారాలను భారత్ చూపిస్తుంది కదా అనే ప్రశ్నకు... తమదేశంలో ఉన్న పరిస్థితే అన్నిచోట్లా ఉంటుందనుకుంటున్నాడేమో కానీ "ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా ఎవరైనా ఆయుధాలు కొనుక్కోవచ్చని చెప్పుకొస్తున్నాడు". ఆయుదాలు పాక్ వే అయి ఉండవచ్చు, ఆ ఉగ్రవాదులు వాడిన అన్ని వస్తువులూ - తిను బండారాలు సైతం మేడిన్ పాక్ అయ్యి ఉండవచ్చు కానీ.. ఆ దాడికి పాల్పడినవారు మాత్రం పాక్ నుంచే వచ్చారనడానికి ఆధారాలు లేవు అని నిస్సిగ్గు సమర్ధనకు తెరలేపాడు ముషార్రఫ్.