Begin typing your search above and press return to search.

రేవంత్ చేసిన సాయం మరవని నేత

By:  Tupaki Desk   |   6 July 2021 2:30 PM GMT
రేవంత్ చేసిన సాయం మరవని నేత
X
రాజకీయాల్లో చేసిన సాయం ఈజీగా మరిచిపోతుంటారు నేతలు. ఓట్లేసిన ప్రజలను సైతం కొందరు లెక్కచేయరు. కానీ తన గెలుపునకు కృషి చేసిన వ్యక్తికి ఇప్పుడు సాయం అవసరం కాగా.. ముందుకొచ్చాడు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. రేవంత్ రెడ్డికి అండగా నిలిచారు.

టీపీసీసీ చీఫ్ గా నియామకం అయిన రేవంత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవి రంగంలోకి దిగారు. రేవంత్ గతంలో తన గెలుపుకోసం చేసిన కృషికి ఇప్పుడు రుణం తీర్చుకుంటున్నాడట.. ఈ నేపథ్యంలోనే పలువురు సీనియర్లను కలుస్తూ రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే తీవ్రంగా వ్యతిరేకించిన నేతల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఒకరు. ఆయన రేవంత్ ను పీసీసీ చేయడాన్ని జీర్ణించుకోలేదు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబును పీసీసీ చీఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయడంతో మల్లు భట్టి విక్రమార్క తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు.

ఈ క్రమంలోనే తన తమ్ముడు భట్టి విక్రమార్క ను బుజ్జగించేందుకు ఆయన అన్న మల్లురవి రంగంలోకి దిగాడు. భట్టితో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో పీసీసీ ఎంత ముఖ్యమో.. సీఎల్పీ నేత కూడా అంతే ముఖ్యమని.. పీసీసీ, సీఎల్పీ రెండు కళ్ల లాంటి వాంటివి అని తమ్ముడు భట్టికి అన్న మల్లు రవి వివరించారట.. భట్టి తన తమ్ముడు అని.. సోనియాగాంధీ నిర్ణయం మేరకు పనిచేయాలని సూచించినట్టు తెలిపారు.

గతంలో రేవంత్ రెడ్డి కుటుంబం తాను ఎంపీగా గెలవడానికి పనిచేసిందని.. అందుకే తాను రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచానని మల్లు రవి చెబుతున్నారు. ఇక మల్లు రవి బుజ్జగింపుతో మల్లు భట్టి విక్రమార్క్ సైతం మారాడు. తన అనుచరులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి కూడా భట్టిని కలుస్తానని చెప్పుకొచ్చారు.

మొత్తంగా టీ కాంగ్రెస్ సీనియర్లు అందరినీ మెల్లిగా రేవంత్ రెడ్డి అన్ని ఆయుధాలను వాడుతూ బుజ్జగింపులు చేస్తున్నారు. అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరీ..