Begin typing your search above and press return to search.

జగన్ సైతం ఇప్పుడు బోల్తా పడుతున్నారా?

By:  Tupaki Desk   |   8 Dec 2021 2:58 AM GMT
జగన్ సైతం ఇప్పుడు బోల్తా పడుతున్నారా?
X
పవర్ లేనప్పుడు పలుకరించటానికి సైతం చాలామంది తటపటాయిస్తుంటారు. అంతదాకా ఎందుకు.. 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ.. చంద్రబాబు అండ్ కో విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి సమాయుత్తమైన వేళ.. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్దకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు లోటస్ పాండ్ వద్దకు ఆయన్ను అమితంగా అభిమానించే పెద్ద మనిషి వెళ్లారు. లోటస్ పాండ్ ను ఎప్పుడూ అలా చూడని ఆయన ఆశ్చర్యపోయారు. ఓటమి కఠినంగా ఉంటుందని తెలిసినా.. మరీ ఇంతలా ఉంటుందా? అని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయాడు. అంతకంటే కూడా ఆశ్చర్యకరమైన సంఘటన ఆయనకు లోటస్ పాండ్ లోపల ఎదురైంది.

అంతకు ముందు జగన్ ను కలవటానికి ఆయన వెళ్లినప్పుడు మహా అయితే పావుగంట.. చాలా చాలా అరుదైన సందర్భాల్లో ఇరవై నిమిషాలకు మించి మాట్లాడే పరిస్థితి లేదు. వైఎస్ నుంచి ఆయనకు వారి కుటుంబంతో సంబంధం ఉండటంతో.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయనకు జగన్ ను కలిసే అవకాశం ఉండేది. అలాంటి ఆయనకు.. ఫలితాలు వెల్లడైన వేళ.. జగన్ ను కలిసి..తాను ఆయనతో ఉన్నానని.. తన లాంటి వాళ్లు ఎంతోమంది ఆయనతోనే ఉంటారన్న విషయాన్ని తన భాషలో చెప్పాలని అక్కడకు వెళ్లారు.

ఆయనకు వెంటనే జగన్ ను కలిసే అవకాశం లభించింది. ఆ గదిలో ఒక్కడిగా ఉన్న జగన్.. తీవ్రమైన నిరాశలో.. ఫలితాలు ఆయన్ను బాగా కలిచివేసినట్లుగా గుర్తించారు. జగన్ తో పాటు.. ఆయన కూడా ఫలితాలు వచ్చిన తీరుపై ఆవేదన చెందారు. అంతటి విషాదంలోనూ ఆయన పరమానందభరితుడైన విషయం ఒకటి ఉంది. ఆ రోజున జగన్ తో గంట పదిహేను నిమిషాలకు పైనే కలిసి ఉండే అవకాశం దక్కింది. ఇదంతా ఎందుకంటే.. విజయం వచ్చినప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లా మూగి ఉంటారు. కానీ.. అపజయం పలుకరించినప్పుడు పత్తా లేకుండా పోతారన్న దానికి ఇది నిదర్శనం.

తన తండ్రి మాదిరే.. జగన్ సైతం ఎన్నో ఎదురుదెబ్బలు తిని ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితికి వచ్చారు. అలాంటి ఆయనకు డక్కా మొక్కీలు తెలీయటమే కాదు.. ఎవరు ఎలాంటి వారన్న విషయం మీద అవగాహన ఉంది. కానీ.. అలాంటి ఆయన సైతం ఇప్పుడు బోల్తా పడుతున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. గడిచిన రెండున్నరేళ్ల పాలనలో ఎప్పుడూ లేని రీతిలో ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు షాకింగ్ గా మారుతున్నాయి.

ఓటీసీ స్కీం విమర్శలు ఒక కొలిక్కి రాకముందే.. తాజాగా మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లలో కొత్తగా వేసే లేఔట్లలో రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు శాతం భూమిని కానీ.. లేదంటే ఐదు శాతం విలువైన డబ్బైనా చెల్లించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనుకున్న కారణం.. తీవ్రమైన ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రానికి ఏదోలా ఆదాయాన్నితెచ్చి పెట్టాలన్న ప్రయత్నంగా చెప్పొచ్చు. కానీ.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు దాని విపరిణామాల మీద జగన్ కు సరైన ఫీడ్ బ్యాక్ ఎవరూ ఇవ్వలేదన్నట్లుగా ఈ నిర్ణయాన్ని చూసినప్పుడు కనిపిస్తుంది.

ప్రభుత్వం ఇచ్చిన రెండు ఆప్షన్లలో.. లేఔట్ల యజమానులు ఎవరైనా సరే.. ఐదు శాతం భూమి ఇచ్చే బదులు.. అందుకు తగ్గ డబ్బును చెల్లించేందుకే సిద్ధమవుతారు. దీని కారణంగా ఆదాయం వస్తుందన్న లాజిక్ బాగానే ఉన్నా.. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఉదాహరణకు పది ఎకరాల లేఔట్ వేస్తే.. అందులో అర ఎకరం భూమిని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఖర్చులకు ఇదో అదనపు ఖర్చు అవుతుంది. ఇలాంటివి రియల్ బూమ్ బాగా ఉన్న ప్రాంతాల్లో అమలు చేస్తే.. ఫలితం కొంతైనా ఉంటుంది. అందుకు భిన్నంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో లేఔట్లు వేసే విషయంలో వంద రకాలుగా ఆలోచిస్తున్నారు.

ఇలాంటప్పుడు.. తాజాగా తీసుకున్నకొత్త నిర్ణయంతో రియల్ ఎస్టేట్ వర్గాల మీద పడే భారంతో.. చిన్న.. మధ్యతరహా సంస్థలు కిందా మీదా పడి ప్రభుత్వ నిర్ణయాన్ని ఫాలో అవుతాయి. కానీ.. పెద్ద పెద్ద సంస్థలు.. ఇలాంటి వాటిని కంటే కూడా.. తమకు ప్రోత్సాహకాలు అందించే వేరే రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకోవటానికి మొగ్గుచూపుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. నిత్యం సంక్షేమ పథకాల కోసం వందల కోట్ల రూపాయిల్ని ఖర్చు చేసే జగన్.. ఇలాంటి నిర్ణయాలతో భారీ మొత్తం కాక చిల్లర మాత్రమే మిగిలే వీలుంది. అదే సమయంలో.. ప్రభుత్వానికి సంక్షేమ పథకాలతో వచ్చే ఇమేజ్ కు రెట్టింపు డ్యామేజ్ జరుగుతుంది.

తాను అధికారంలో లేనప్పుడు తన వెంట ఉన్న వారిని జగన్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రభుత్వానికి అవసరమైన ఆదాయం కోసం ఎక్కడా లేని కొత్త తరహా బాదుడు సలహాలు ఇస్తున్న బ్యాచ్ కు దండం పెట్టి.. దండేసి.. దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అలా కాకుంటే.. ప్రజలకు జగన్ సర్కారు దూరమవుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.