Begin typing your search above and press return to search.

ఎందుకింత బిల్డప్ బాబూ . ప్రపంచాన్ని జయించినట్లు...పేర్ని నాని సెటైర్లు

By:  Tupaki Desk   |   2 April 2023 7:46 PM GMT
ఎందుకింత బిల్డప్ బాబూ . ప్రపంచాన్ని జయించినట్లు...పేర్ని నాని సెటైర్లు
X
మాట్లాడితే పేర్ని నానే అన్నట్లుగా వైసీపీలో ముద్ర వేసుకున్నారాయన. వెటకారం డాట్ కాం అంటే నానే గుర్తుకు వస్తారు. ఆయన నెమ్మదిగా మాట్లాడుతూనే పంచులు బాగా అంటించేస్తారు. ఆయన పొగిడారో విమర్శించారో కూడా అర్ధం చేసుకోవడం బహు కష్టం. పేర్ని నాని పంచులు ఎపుడూ పవన్ కళ్యాణ్ కే అంకితం అనేలా ఉంటాయి. కానీ చాలా రోజుల తరువాత మాజీ మంత్రి గాలి చంద్రబాబు వైపు మళ్లించారు.

చంద్రబాబు నాలుగు ఎమ్మెల్సీ సీట్లు గెలిచామన్న జోష్ లో ఉన్నారు. అయితే ఆ ఆనందం ఏదీ లేకుండా చేసి పారేశారు పేర్ని నాని ఫుల్ గా గాలి తీసేశారు అనే చెప్పాలి. పేర్ని నాని మీడియా మీటింగులో చాలా మాట్లాడారు. అయితే ఆయన అన్న ఒకే ఒక్క డైలాగ్ మాత్రం చంద్రబాబునే కాదు ఆయన అభిమానులను విపరీతంగా బాధించేలా ఉందని చెప్పాల్సి ఉంటుంది.

ముఖ్యమంత్రి జగన్ కి ఏ స్థాయిలోనూ చంద్రబాబు అసలు పోటీ పడలేరని నాని పెర్ఫెక్ట్ అంచనాలతో తేల్చేశారు. ఈ మాట అన్న తరువాత వేయి మాటలెందుకు అన్నట్లుగానే నాని తరువాత మాటలను చెప్పుకోవాలి. వై నాట్ 175 వై నాట్ పులివెందుల అంటున్న చంద్రబాబుకు నిజంగా 175 సీట్లలో పోటీ పెట్టడానికి అభ్యర్ధులు ఉన్నారా అని పేర్ని నాని అడిగి కడిగేశారు.

ఈ రోజుకీ ముప్పయి ఎనిమిది సీట్లలో తెలుగుదేశానికి అభ్యర్ధులే లేరని, ముందు ఆ సంగతి వెళ్లి చూసుకోవాలని సూచించారు. వై నాట్ పులివెందుల అని మంగళగిరి లో దీర్ఘాలు తీయడం కాదు దమ్ముంటే జగన్ కి ఎదురుగా నిలిచి పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేయాలని పేర్ని నాని సూచించారు. బాబుకు అంత శక్తి లేకపోతే పవన్ కళ్యాణ్ ని తోడుగా తీసుకుని రావాలని ఇద్దరూ విడివిడిగా జగన్ మీద పోటీ చేసినా లేక కలసి మద్దతు ఇచ్చుకుని పోటీ చేసినా పులివెందులలో జగన్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారు అని నాని జోస్యం చెప్పారు.

వై నాటి 175 అంటున్న చంద్రబాబు ఏమి విజయం సాధించారని ఇంత లేని నిబ్బరాన్ని ప్రదర్శిస్తున్నారు అని పేని నాని ప్రశ్నించారు. మొత్తం 21 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగితే వైసీపీ 17 గెలిచిందని, జస్ట్ నాలుగు సీట్లు గెలిచి అక్కడికి ప్రపంచాన్ని గెలిచేసినట్లుగా ఎందుకింత బిల్డప్ బాబూ అని ఎద్దేవా చేశారు. అంతా కలసికట్టుగా పోటీ చేయకపోతే ఓడిపోతామన్న బెంగతో ఉన్న మీరు కూడా సవాళ్ళు చేయడం ఏమైనా బాబుందా అని సెటైర్లు వేశారు.

జగన్ గురించిన విమర్శలు పక్కన పెట్టి ముందు ఎన్ని సీట్లు జనసేనకు ఇస్తున్నారు, ఎన్ని సీట్లు రాహుల్ గాంధీ కాంగ్రెస్ కి ఇస్తున్నారు, కమ్యూనిస్టులకు ఎన్ని సీట్లు ఇస్తున్నారో చెప్పాలని నాని డిమాండ్ చేశారు. పేదల పక్షం ఉండాల్సిన వామపక్షాలు పెత్తందారుల పార్టీ అయిన టీడీపీకి వంత పాడడం దారుణమని పేర్ని నాని విమర్శించారు.

అమరావతి రాజధాని అంటూ ఒక టెంట్ వేసి అద్దె మైకులను నాలుగు పోగేసి జగన్ మీద విమర్శలు చేస్తే సరిపోతుందా అని ఆయన నిలదీశారు. బీజేపీ 2018లో చేసిన రాయలసీమ డిక్లరేషన్ ఎక్కడికి పోయిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూల్ లో హై కోర్టు అన్న బీజేపీ పెద్దలు ఇపుడు అంతా అమరావతిలోనే అని చెప్పడం దగాకోరు రాజకీయమేనని నాని అంటున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం విశాఖ రాజధానికి బాగుంటుందని చెప్పి ఇపుడు ఇలా మాట్లాడమేంటని నాని ప్రశ్నించారు. మొత్తానికి చంద్రబాబు మీద ఒక్క లెక్కన నాని విరుచుకుపడ్డారనే చెప్పాలి. మరి దీనికి తెలుగుదేశం నుంచి మాటల అటాక్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాల్సిందే. మంత్రి వర్గ విస్తరణ అన్నది అసలు ఉండదని, అవన్నీ మీడియా రాతలే అని నాని తేల్చేశారు. ఈ మంత్రివర్గంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని మళ్లీ జగన్ సీఎం కావడం ఖాయమని నాని స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.