Begin typing your search above and press return to search.

అదేందయ్యా పేర్ని నాని.. సీఎంను ఏకవచనంతో సంబోధించటమా?

By:  Tupaki Desk   |   24 May 2023 1:11 PM GMT
అదేందయ్యా పేర్ని నాని.. సీఎంను ఏకవచనంతో సంబోధించటమా?
X
అభిమానం ఉంటేనే సరిపోదు. పొంగి పొర్లే ప్రేమతోనే అన్ని అయిపోవు. నోటి నుంచి వచ్చే మాట కూడా తేడాగా ఉండకూడదు. అన్నీ బాగుండి.. మాటలో తేడా ఉంటే ఎంతవారికైనా ఇబ్బందే. అందునా.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు వయసులో తమకంటే చిన్నవారు అయినప్పటికి స్థాయి పెద్దది కాబట్టి.. గౌరవ మర్యాదల్లో తేడా రాకూడదు. ఆ విషయంలో తేడా కొడితే చోటు చేసుకునే ఇబ్బందికర పరిస్థితులు తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని అనుభవంలోకి వచ్చాయి. బందరు పోర్టు శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా పేర్ని నాని చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

ఇదంతా బాగానే ఉన్నా.. తన ప్రసంగంలో సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. సభ పూర్తై తిరిగి వెళ్లే వేళలో ఆయనకు మెత్తటి క్లాస్ పడిందన్న మాట వినిపిస్తోంది. 'నా కంటే వయసులో చిన్నవాడైనా.. పాదాభివందనం చేస్తున్నా. పాలాభిషేకం చేయాలి' అన్న మాట బాగానే ఉన్నా.. ఆ తర్వాతి ప్రసంగంలో సీఎం జగన్ ను ఉద్దేశించి ఏకవచనంతో చేసిన వ్యాఖ్యలకు ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వచ్చిందంటున్నారు.

''మన జిల్లాలో మంత్రి జోగి రమేశ్.. ఎమ్మెల్యే కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్.. సామినేని ఉదయభాను.. రక్షణ నిధిలను చూస్తే కాస్త ఈర్ష్యగా ఉంటుంది. ఒక్కసారి బందరు రావయ్యా.. ఇక్కడికి వచ్చి ఆటోవాళ్లకో.. మత్స్యకారులకో.. విద్యావీవెనో.. ఏదో ఒక బటన్ నొక్కవయ్యా.. అని జగన్ ను పిలిచాను. ఆయన రాలేదు. పాదయాత్ర సందర్భంగా ఆయన ఇచ్చిన హామీ బందరు ఓడరేవు పనులు చేపడతానని.. అప్పుడే వస్తానన్నాడు.ఇప్పుడు బందరుకు వచ్చాడు. సీఎం జగన్ ను కలిసే అవకాశం మళ్లీ దక్కుతుందో లేదో.. కొద్దిగా కష్టమైనా ఉక్కపోత ఉన్నా.. భరించాల్సిందే'' అంటూ పేర్ని నాని ప్రసంగం సాగింది.

తన ప్రసంగంలో సీఎం జగన్ ను ఉద్దేశించి ఏకవచనంలో మాటలు దొర్లటం సీఎం జగన్ ని అభిమానించే ప్రజలకి అలానే అంతటి ఉన్నత స్థానం లో ఉన్న వ్యక్తులని ఆలా సంబోధించడం సభ కి వచ్చిన ప్రజలకి నచ్చదు . దీనిపై పేర్నినాని వద్ద సీఎంవో కార్యదర్శి కె.ధనుంజయ్ రెడ్డి ప్రస్తావించటమే కాదు.. మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా? అన్న మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏకవచనంపై ముఖ్యమంత్రి జగన్ నేరుగా రియాక్టు కాకున్నా.. సీఎంవో కార్యదర్శి మాత్రం నోట్ చేసి మరీ పేర్నినానికి చెప్పినట్టు తెలుస్తోంది. సభలో సీఎంను ఏకవచనంలో సంబోధించటం ఏమిటి? అది మంచి పద్దతి కాదన్న మాటను పేర్నినానికి చెప్పినట్లుగా సమాచారం. దీనికి తోడు రిటైర్మెంట్ గురించి తరచూ మాట్లాడటాన్ని తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమారుడు పేర్ని కిట్టును బరిలోకి దింపాలన్న యోచనలో ఉన్నారు. 'ముఖ్యమంత్రి వద్దంటున్నా.. పదే పదే రిటైర్ మెంట్ గురించి ఎందుకు మాట్లాడతారు? ఇది సరి కాదు. ఇదెలాంటి సిగ్నల్స్ ను ఇస్తుంది' అంటూ సీఎంవో కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని ఇబ్బందికి గురైనట్లుగా తెలుస్తోంది. అభిమానం మంచిదే కానీ.. ఈ తరహాతో ఇబ్బందులే అన్న విషయాన్నిమర్చిపోకూడదు.