Begin typing your search above and press return to search.

జగన్‌ తో ఇదే నా చివరి మీటింగ్‌: పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   22 May 2023 4:50 PM GMT
జగన్‌ తో ఇదే నా చివరి మీటింగ్‌: పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు!
X
మాజీ మంత్రి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 22న బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌ తో ఇదే తన చివరి మీటింగ్‌ అని తెలిపారు. మళ్లీ ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం వస్తుందో, రాదో తెలియదన్నారు. తనకు తొందరగా ప్రసంగాన్ని ముగించాలని ఉన్నా మళ్లీ జగన్‌ ను కలిసే అవకాశం వస్తుందో, రాదో తెలియదని, ఇదే చివరి మీటింగ్‌ కావచ్చని.. అందుకే ఎక్కువ సేపు మాట్లాడుతున్నానని తెలిపారు.

కాగా ఇప్పటివరకు బందరు నుంచి మూడుసార్లు పేర్ని నాని ప్రాతినిధ్యం వహించారు. తొలిసారి 2004లో ఆయన కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి 2009లోనూ అదే పార్టీ నుంచి నెగ్గారు. 2014లో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర చేతిలో ఓడిపోయారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కొల్లు రవీంద్రపై విజయం సాధించారు.

వచ్చే ఎన్నికల్లోనూ తనకు బదులుగా తన కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేస్తారని ఇప్పటికే పేర్ని నాని ప్రకటించారు. ఇందుకు తగ్గట్టు బందరు నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో పేర్ని కిట్టునే హవా చలాయిస్తున్నారు. అయితే వైఎస్‌ జగన్‌.. పేర్ని కిట్టు పోటీకి ఒప్పుకున్నారా లేదా అనే సంగతి ఇంకా తెలియదు.

పేర్ని నాని మాత్రం వచ్చే ఎన్నికలలో తన కుమారుడు పేర్ని కిట్టునే పోటీ చేస్తారని చెబుతున్నారు. జగన్‌ కు చెప్పకుండా ఆయన అనుమతి లేకుండా పేర్ని నాని తన కుమారుడిని పోటీకి దించడానికి సాహసించరని టాక్‌ నడుస్తోంది.

కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బందరుకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారని పేర్ని నాని కొనియాడారు. సీఎం జగన్‌ చెప్పింది చేస్తారని.. చెప్పాడంటే చేస్తారంతేనని అని ప్రశంసించారు. బందరు పోర్టు నిర్మాణం ద్వారా పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారని వెల్లడించారు. బందరు పోర్టు పనులు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారని పేర్ని నాని ఆరోపించారు.

జగన్‌ బందరులో కాలనీలు కాదు.. ఊళ్లే నిర్మిస్తున్నారని కొనియాడారు. బందరు నియోజకవర్గంలో 25,090 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. బందరు వాసుల కలను సీఎం జగన్‌ నెరవేర్చారని తెలిపారు. రూ. 197 కోట్ల విలువైన భూములను పేదలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు.

బందరుకు మెడికల్‌ కాలేజీ తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌ దేనని తెలిపారు. 64 ఎకరాల్లో రూ. 550 కోట్లతో మెడికల్‌ కాలేజీ నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. ఏపీలో 31లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు దేశంలోనే ఎవరూ లేరని కొనియాడారు. బందరులో గోల్డ్‌ కవరింగ్‌ యూనిట్‌ లను నిలబెట్టిన ఘనత కూడా సీఎం జగన్‌ దేనని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేదలకు సెంటు భూమి ఇచ్చారా? అని పేర్ని నాని నిలదీశారు.