Begin typing your search above and press return to search.

పవన్ లాంగ్ మార్చ్ కు అనుమతి.. పార్టీలు డుమ్మా

By:  Tupaki Desk   |   2 Nov 2019 10:51 AM GMT
పవన్ లాంగ్ మార్చ్ కు అనుమతి.. పార్టీలు డుమ్మా
X
ఏపీలో ఇసుక సంక్షోభంపై జనసేన తలపెట్టిన ‘లాంగ్ మార్చ్’కు ఎట్టకేలకు చాలా అవాంతరాల తర్వాత అనుమతి లభించింది. ఏపీలో ఇసుక కొరత వల్ల ఉపాధి కరువైందని.. భవన నిర్మాణ రంగం కుదేలైందని.. కూలీలకు అండగా రేపు విశాఖ సాగరతీరంలో వేలాది మందితో జనసేన లాంగ్ మార్చ్ కు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన జనసమీకరణ, ఇతర ఏర్పాట్లు కూడా జనసేన అగ్రనేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబులు పర్యవేక్షిస్తున్నారు.

అయితే లాంగ్ మార్చ్ కు తొలుత అనుమతి లేదని వార్తలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం ఈ ఆందోళనకు అనుమతి ఇవ్వలేదని ప్రచారం జరిగింది. అధికారులు ఏర్పాట్లు అడ్డుకున్నట్టు తెలిసింది. ఎట్టకేలకు అనేక అవాంతరాల తర్వాత లాంగ్ మార్చ్ కు పోలీసులు అనుమతిని ఇచ్చారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ లో స్వయంగా ప్రకటించారు. కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి, మద్దతు దారులు రాకుండా అడ్డుకునేందుకు కొందరు లాంగ్ మార్చ్ కు అనుమతి లేదంటూ ప్రచారం చేస్తున్నారని.. ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని పవన్ ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశారు.

విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్ లో తెలుగు తల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వరకు రెండున్నర కిలోమీటర్ల పాదయాత్రకు పార్టీలు మాత్రం మద్దతు ఇచ్చినా ఇందులో పాల్గొనకుండా డుమ్మా కొట్టడం జనసేనకు దెబ్బగా పరిణమించింది. సొంతంగా అంతగా బలంలేని జనసేన.. ఇప్పుడు పార్టీలన్నీ దూరంగా ఉండడంతో ఈ నిరసన విజయవంతం అవుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

ఇప్పటికే లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని జనసేనని పవన్ స్వయంగా టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలకు ఫోన్ చేశారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీనికి మద్దతు తెలిపారు. కాగా పవన్ కు సన్నిహితంగా ఉండే వామపక్షాలు తాజాగా జనసేనానికి షాకిచ్చారు. లాంగ్ మార్చ్ కు తమతోపాటు బీజేపీని కూడా ఆహ్వానించడంతో తాము దూరంగా ఉంటున్నామని సీపీఐ, సీపీఎం కార్యదర్శులు స్పష్టం చేశారు. ఇక టీడీపీ కూడా ప్రత్యక్షంగా పాల్గొనకపోవడంతో పవన్ ఏకాకి అయిపోయారు.