Begin typing your search above and press return to search.

‘సర్వే’ద్రియానం.. పార్టీల గుబులే ప్రదానం

By:  Tupaki Desk   |   13 April 2019 5:07 AM GMT
‘సర్వే’ద్రియానం.. పార్టీల గుబులే ప్రదానం
X
దేశవ్యాప్త సార్వత్రిక పోరులో తొలి అంకం పూర్తయ్యింది. తెలుగురాష్ట్రాల్లో మొదటివిడతలోనే ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించింది ఎన్నికల సంఘం. ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలో భద్రపరిచారు. వీటి ఫలితాలు మే 23 అంటే ఇక దాదాపు 40 రోజులు తరువాత వెలువడనున్నాయి. అయితే ఈ గ్యాప్‌ లో సర్వే సంస్థలు తమ జోరు పెంచుతున్నాయి. ఫలానా పార్టీ గెలుస్తుందని.. ఇన్ని సీట్లు వస్తాయని ఇప్పుడే లెక్కలేసీ మరీ చెబుతున్నాయి. పెన్ను పేపరు పట్టుకొని తమకు నచ్చిన పార్టీకి అనుగుణంగా అంకెలు వేసీ తమ పార్టీదే గెలుపంటూ ప్రచారం చేస్తున్నారు.

ఇదంతా సోషల్‌ మీడియా వేదికగా జరుగుతోంది. తమ పార్టీకి అనుగుణంగా ఆయా స్థానాల్లో ఇన్ని సీట్లు వస్తాయని గ్రాఫ్‌ తో సహా వేసి జనాల మీదకు వదులుతున్నారు. అయితే ఈ సర్వేలు ఏ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆటుమాటుగా వారి అంచనా ప్రకారం లెక్కలు వేసీ ఆ పార్టీదే విజయం అంటూ ప్రచారం చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. దీంతో పార్టీ అధినేతల్లో కొందరిలో గుబులు.. మరికొందరిలో సంతోషం వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో గత డిసెంబర్‌ లో జరిగిన ఎన్నికల్లో సర్వేలకు మారుపేరుగా నిలిచే లగడపాటి నిర్వహించిన సర్వే సైతం బోల్తా కొట్టింది. ఆ సమయంలో టీఆర్‌ ఎస్‌ తక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని లగడపాటి సర్వే తేల్చింది. దీంతో ఒక దశలో టీఆర్‌ ఎస్‌ నాయకులు కూడా ఆందోళన చెందారు. ఓడిపోతామని భయపడ్డారు. కానీ ఫలితం మాత్రం లగడపాటికి వ్యతిరేకంగా వచ్చింది. దీంతో అప్పటి నుంచి జనాలు సర్వేలను నమ్మడం మానేశారు.

అయితే ఏపీలో కేవలం పార్లమెంట్‌ ఎన్నికలు ఉంటే ఇంత జోష్‌ ఉండేది కాకపోవచ్చు. కానీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగడంతో సర్వే రిపోర్టులను చూసి ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. తాము ఒక ప్రభుత్వం వస్తుందనుకుంటే మరొకటి వస్తుందని కొందరు నిరాశ చెందగా.. కొందరు తాము ఓటేసిన పార్టీనే గెలుస్తుందని సంబరపడిపోతున్నారు. అటు పార్టీ నేతలు కూడా సర్వేలను నమ్మకపోవడమే బెటరనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలో కొన్ని పార్టీలు ప్రత్యేకంగా సర్వేలు చేయించుకునేవారు. కానీ సర్వేలకు వ్యతిరేకంగా ఫలితాలు వస్తుండడంతో వాటిని జనాలను పట్టించుకోవడం లేదనే వార్తలు వస్తున్నాయి. అయితే పోలింగ్‌ ముగిసిన రెండు రోజులకే ఇంత హడావుడి ఉంటే ఈ 40 రోజుల్లో ఎన్ని సర్వే సంస్థలు తమ అభిప్రాయాన్ని చెప్పి కన్ఫ్యూజ్‌ చేస్తారోనని పార్టీ నేతలు, సాధారణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.