కరోనా మహమ్మారి ఈ రోజు భారత్ ను వేధిస్తుందంటే దానికి కారణం.. విదేశాల నుంచి వచ్చినోళ్ల పుణ్యమేనన్నది మర్చిపోకూడదు. విదేశాలకు వెళ్లే వారిలో అత్యధికులు మంచి చదువుకొని.. చక్కటి ఉద్యోగం చేసుకుంటూ.. సంపద విషయంలోనే కాదు.. అలవాట్లు.. ఆలోచనలు సైతం అంతో ఇంతో బాగుంటాయన్న భావన మొన్నటి వరకూ ఉండేది. కానీ.. ఎప్పుడైతే కరోనా ఎపిసోడ్ స్టార్ట్ అయ్యిందో.. విదేశాల నుంచి వచ్చే మనోళ్లు ఇంత దరిద్రంగా.. దారుణంగా వ్యవహరిస్తారా? అన్న సందేహంతో పాటు.. వారి తీరు ఒళ్లు మండేలా చేస్తోంది.
ప్రాణాపాయం నుంచి తప్పించుకొని స్వదేశానికి చేరుకున్నామన్న అసలు విషయాన్ని చాలామంది మర్చిపోతున్నట్లుగా ఉంది. కరోనా వేళ.. విదేశాల్లో ఉండి ఉంటే.. అక్కడున్న ఆంక్షలకు అన్ని మూసుకొని ఉండేటోళ్లు. తేడా వస్తే.. దాని విపరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నది వారికి తెలియనిది కాదు. అలాంటివేళ.. విదేశాల నుంచి వచ్చిన స్వదేశీయులు.. ఎంచక్కా ఎవరిళ్లల్లో వారిని సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోవాలని కోరితే..ఆ విషయాన్ని పట్టించుకోని తీరు ఏ మాత్రం సరికాదంటున్నారు.
సరిగ్గా చెప్పాలంటే.. విదేశాల నుంచి వచ్చిన వారు స్వదేశీయులకు ఆదర్శంగా నిలవటమే కాదు.. కరోనా విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో అవగాహన కల్పించేలా ఉండాలే తప్పించి.. బాధ్యత లేకుండా బలాదూర్ తిరుగుతున్న వారి తీరు చూస్తే.. అనవసరంగా విదేశాల నుంచి వారిని తీసుకొచ్చామా? అన్న భావన కలగక మానదు. విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ విధిస్తే.. వాటిని వదిలేసి.. ఎక్కడికి పడితే అక్కడకు తిరుగుతున్న తీరు చూస్తే.. ఇలాంటి వారిని అనవసరంగా దేశంలోకి రానిచ్చి భారీ తప్పు చేశామా? అన్న భావన కలుగక మానదు.
ఇంతకాలం విదేశాల నుంచి వచ్చిన వారు చేస్తున్న తప్పుల విషయంలో అటు ప్రభుత్వం.. ఇటు ప్రజలు ఓపికతో సహిస్తున్నారన్నది మర్చిపోకూడదు. బాధ్యత లేకుండా ధావత్ లని తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కసరత్తుచేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాలి. అదే సమయంలో విదేశాల నుంచి వచ్చి ప్రభుత్వం చెప్పినట్లు ఇంట్లో ఉండకుండా అటు ఇటు తిరిగే వారిపై అయితే 100.. లేదంటే 104కు సమాచారం ఇవ్వటం.. వారి నుంచి స్పందన లేకుండా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వటం చాలా అవసరం. విదేశాల నుంచి వచ్చినోళ్లు బాధ్యత లేకుండా వ్యవహరించటం కారణంగా.. ఇక్కడి ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశాన్ని ఇవ్వకూడదన్నది మర్చిపోకూడదు.