Begin typing your search above and press return to search.

నామినేషన్ వేయటానికి నగ్నంగా వచ్చిన అన్నదాతలు

By:  Tupaki Desk   |   21 March 2021 4:56 AM GMT
నామినేషన్ వేయటానికి నగ్నంగా వచ్చిన అన్నదాతలు
X
తమిళనాడు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా నామినేషన్లు దాఖలు చేయటానికి నగ్నంగా బయలుదేరిన రైతుల వ్యవహారం కలకలం రేపింది. తిరువణ్ణామలై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సౌత్ ఇండియా నదుల అనుసంధానం రైతుల సంఘం ఆధ్వర్యంలో ఇద్దరు రైతులు (చక్రపాని.. రాజేంద్రన్) వందవాసి.. మేల్ సామ్ కుప్పం గ్రామాల నుంచి తిరువణ్ణామలైకు వచ్చారు.

నామినేషన్ వేసేందుకు పెరియార్ విగ్రహం నుంచి నగ్నంగా బయలుదేరారు. వీరి ప్రయత్నాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే స్పందించి.. వారికి దుస్తులు కప్పి.. నామినేషన్ దాఖలు చేయకుండా ఆపేశారు. దీంతో.. ఈఇద్దరు రైతులు రోడ్డు మీద ధర్నా నిర్వహించారు. దీంతో ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రమంత్రి అమిత్ షా రైతుల సంఘాల్ని ఢిల్లీకి పిలిపించి.. రూ.6వేలు పింఛన్ అందజేస్తామని హామీ ఇచ్చారని.. కానీ అదేమీ జరగలేదన్నారు. గోదావరి - కావేరి నదులను అనుసంధానం చేస్తానని హామీ ఇచ్చారు అది కూడా ఇప్పటివరకు వాస్తవ రూపం దాల్చలేదన్నారు. కేంద్రం తీరును ఖండిస్తూ.. బీజేపీ మీద పోటీ చేసేందుకుతాము నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. నగ్నంగా నామినేషన్లు వేసేందుకు వచ్చిన ఇద్దరు రైతు నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.