Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో ఏపీ సీన్‌.. స‌భ జ‌రుగుతుండ‌గానే జ‌నం ప‌రార్‌!

By:  Tupaki Desk   |   17 April 2023 7:00 AM GMT
తెలంగాణ‌లో ఏపీ సీన్‌.. స‌భ జ‌రుగుతుండ‌గానే జ‌నం ప‌రార్‌!
X
ఇటీవ‌ల కాలంలో ఏపీలో అధికార పార్టీ నాయ‌కులు నిర్వ‌హిస్తున్న స‌భ‌ల్లో చిత్ర‌మైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. మంత్రు లు మాట్లాడుతుండ‌గానే.. వారు ఎంత వ‌ద్ద‌ని చెప్పి వారించినా.. ప్ర‌జ‌లు ప‌రుగో ప‌రుగు.. అంటూ గోడ‌లు దూకి.. గేట్లు ఎక్కి స‌భ నుంచి వెళ్లిపోతున్నారు. ఇలాంటివి చాలానే జ‌రుగుతుండ‌డంతో ఏకంగా గేట్ల‌కు తాళం వేసి మరీ స‌భ‌ను నిర్వ‌హించే ప‌రిస్థితి ఏపీలో క‌నిపించింది. అయినా..జ‌నాలు మాత్రం ప‌రుగో ప‌రుగు పెడుతూనే ఉన్నారు. అయితే.. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే తెలంగాణ‌లోనూ చోటు చేసుకుంది.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అధికార పార్టీ బీఆర్ఎస్‌ కార్యకర్తలతో కలిసేందుకు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయ‌న వీరావేశంతో సీఎం కేసీఆర్‌ను ప్ర‌శంసించారు.

కేసీఆర్‌ను అభిన‌వం అంబేడ్క‌ర్ అంటూ కొనియాడారు. అంతేకాదు.. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నార‌ని.. ఆకాశానికి ఎత్తేసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఇవ‌న్నీ వినీ వినీ బోర్ కొట్టింద‌ని భావించారో.. ఏమో సభకు వచ్చిన ప్రజల్లో కొందరు మధ్యలోనే బయటకు వెళ్లాలని భావించారు.

అయితే.. స‌భ‌కు వ‌చ్చిన వారు బయటకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డగించారు. ఎవరూ వెళ్లకుండా గేట్లను మూసివేశారు. దీంతో గేటు దగ్గర ప్రజలకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది.

ఆగ్రహించిన జనం ఒక్కసారిగా గేట్లను తీసుకొని బయటపడ్డారు. మరికొంత మంది గోడదూకి బయటకి వెళ్లిపోయారు. సభలో పోలీసులు ప్రజలపై ప్రవర్తించిన తీరు పలు ప్రశ్నలకి దారితీస్తోంది.

పోలీసులు ఇలా ఎందుకు ప్రవర్తించారని సమావేశానికి వచ్చిన ప్రజలు ప్రశ్నించారు. అయితే ఈ విషయంపై పోలీసులు మాత్రం నోరు విప్పలేదు. మ‌రోవైపు.. 'ఆగండ్రీ..' అంటూ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య అరుపులు మాత్రం మైకుల్లో వినిపించ‌డం గ‌మ‌నార్హం.