Begin typing your search above and press return to search.

నటించిన ముఖ్యమంత్రి.. ప్రజల చ‌ప్ప‌ట్లు!

By:  Tupaki Desk   |   20 May 2021 8:30 AM GMT
నటించిన ముఖ్యమంత్రి.. ప్రజల చ‌ప్ప‌ట్లు!
X
ఇటీవ‌ల జ‌రిగిన‌ త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో డీఎంకే భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌ర్నాడు నుంచే పాల‌న‌లో మునిగిపోయిన‌ స్టాలిన్.. ప్ర‌జాసంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణ‌యాలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో బాధితుల‌కు మెరుగైన వ‌స‌తులు అందించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

రెమ్ డెసివర్ వంటి మందులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో.. నేరుగా వాటిని ప్రైవేటు ఆసుప‌త్రుల‌కే త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించారు. ఆసుప‌త్రుల్లో రోగుల‌కు నిర్ధారించిన ధ‌ర‌కే ఇవ్వాల‌ని, లేక‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా.. ప్ర‌భుత్వ క‌మిటీలో విప‌క్ష నేత‌ల‌కు సైతం స్థానం క‌ల్పించి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు.

ఇప్పుడు.. కొవిడ్ నుంచి ర‌క్ష‌ణ కోసం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నే అంశంమీద స్వ‌యంగా స్టాలినే ప్ర‌జ‌ల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. స‌హ‌జంగా.. ఇలాంటి విష‌యాల్లో సినిమా స్టార్లను రంగంలోకి దించుతారు. వారితో వీడియోలు రూపొందించి, జాగ్ర‌త్త‌లు చెప్పిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. కానీ.. కొవిడ్ జాగ్ర‌త్త‌లు చెప్పేందుకు స్వ‌యంగా ముఖ్య‌మంత్రి కెమెరా ముందుకు రావ‌డం విశేషం.

అంతేకాదు.. చాలా చ‌క్క‌గా అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా.. అంద‌రినీ ఆక‌ట్టుకునేలా వీడియోలో సూచ‌న‌లు చేశారు స్టాలిన్‌. ఇక‌, త‌మిళ‌లు భాష‌, సంప్ర‌దాయాల‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. ఇందులో భాగంగా స్టాలిన్ మాస్కును కూడా త‌మ భాష‌లోని ఓ ప‌దంతో ఉచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. సీఎం ఇలా స్వ‌యంగా వీడియో ద్వారా చెప్ప‌డం ప‌ట్ల ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి అంద‌రివాడు అనిపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు స్టాలిన్‌.