Begin typing your search above and press return to search.

ఏపీ జనాల కు ఆప్షన్ లేదా...డెసిషన్ అందుకే అలా...?

By:  Tupaki Desk   |   26 May 2023 3:06 PM GMT
ఏపీ జనాల కు ఆప్షన్ లేదా...డెసిషన్ అందుకే అలా...?
X
ఏపీ ప్రజల కు రెండే పార్టీలా. అంతకు మించి అవకాశం లేదా. అసలు ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నో అవకాశాలు. మారుతున్న కాలానికి తగినట్లుగా తమ అభిరుచికి ఆలోచనల కు తగినట్లుగా విభజన ఏపీ శ్రేయస్సు కోసం ఓటర్లు తీర్పు ఇస్తూంటారు. కానీ ఏపీలో మాత్రం 2024లో జనాల కు ఆ చాన్స్ లేదని అంటున్నారు.

ఎంతో మోజుతో 2014లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చారు. సైబరాబాద్ క్రియేటర్ చంద్రబాబు అని నెత్తిన పెట్టుకున్నారు. ఆయన అనుభవం ఏపీని విభజన గాయాల నుంచి ఒడ్డున పడేస్తుందని ఆశించారు. అయితే చంద్రబాబు అయిదేళ్ల అధికారాన్ని తన సొంత ఆలోచనల మేరకే వాడారు.

దాంతో ఆయన రాజధానిని గ్రాఫిక్స్ మాటున అలా ఉంచేశారు. ఏది కట్టినా వేల కోట్ల ప్రజల ఖర్చు పోవడం తప్ప అంతా టెంపరరీగానే మిగిలింది. పోనీ అవే పెర్మనెంట్ అని సరిపెట్టుకుందామంటే నాణ్యత లేకుండా అవి దారుణమైన కట్టడాలుగా మిగిలాయి.

ఇలా లాభం లేదని జగన్ని తెచ్చి పెట్టుకుంటే ఆయన పాలన కూడా అలాగే ఉంది. చంద్రబాబు ఆపిన చోట నుంచి మొదలెట్టకుండా అసలు అభివృద్ధి అంటే ఏమిటో వైసీపీ ఏలికలు నిర్వచనం ఇవ్వలేని స్థితిలో పడ్డారు. మబ్బుల్లో నీళ్లు చూపించి ముంత బోర్ల ఒలకబోసినట్లుగా మూడు రాజధానులు అంటూ లేని దాన్ని చెబుతూ నాలుగేళ్ళుగా కాలక్షేపం చేశారని అంటున్నారు.

ఇంకో పది నెలలలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. నిజానికి ఈపాటికే ఏపీ ఓటర్లలో వేడి పుట్టాలి. తాము ఎన్నుకోబోయే పార్టీ ఏమిటో చూచాయగా తెలియచేయాలి. కానీ ఆ సంకేతాలు అయితే ఎక్కడా కనిపించడంలేదు. వైసీపీ గ్రాఫ్ తగ్గుతోంది కానీ ఆ స్థాయిలో టీడీపీ ఎత్తిగిల్లడంలేదు. అలాగే మూడవ పార్టీగా వస్తారనుకున్న జనసేన కూడా పొత్తుల వైపు వెళ్ళిపోతోంది.

దాంతో ఏపీ జనాలు ఈ రోజుకూ ఒక డెసిషన్ కి రాలేని స్థితిలో ఉన్నారని అంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్లీ అమరావతి పాట పాడతారని అందరికీ తెలుసు. ఇప్పటికే విశాఖ టూర్ లో బాబు తన తమ్ముళ్ల చేత అమరావతికి జై కొట్టించారు. దాంతో మెల్లగా చర్చ మొదలవుతోంది. ఇక బాబు వస్తే ప్రభుత్వ ఉద్యోగుల కు వారి బాధలు వారికి ఉన్నాయని అంటున్నారు.

అదే విధంగా ఏపీలో బాబు పాలన అంతా చూసేశారు. కొత్తదనం ఏముంటుంది అన్న చర్చ వస్తోంది. ఇక బేసికల్ గా బాబు ఎర్లీ సెవెంటీస్ ఆలోచనలతో ముందుకు సాగుతారు అన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. తెలుగుదేశాన్ని అనుకూల మీడియా ఎంతలా జాకీలు పెట్టి లేపుతున్నా కొత్తదనం లేకపోవడం వల్లనే జనాలకు అట్రాక్ట్ కావడంలేదు అంటున్నారు.

వాస్త వానికి ఒక పార్టీ మీద జనాల కు విసుగు వస్తే ఆల్టర్నేషన్ గా మరో పార్టీ ఉంటుంది. అలా 2017 నాటికే వైసీపీ కి జగన్ కి అనుకూలంగా జనాలు వెల్లువెత్తారు. ఇపుడు మాత్రం తెలుగుదేశం వైపు రావడానికి ఆలోచిస్తున్నారు. అలాగని వైసీపీ ని మళ్లీ నెత్తికెత్తుకోవడానికి రెడీగా లేరు అని అంటున్నారు. ఇది అన్ని వర్గాల ప్రజలలోనూ భావనగా ఉంది.

నిజానికి ఏపీలో ఇపుడు మూడవ పక్షానికి అనుకూల వాతావరణం ఉంది అని అంటున్నారు. రెండు పార్టీలూ విఫలమైన చోట కొత్త పార్టీ వస్తే జనాలు ఆదరించేందుకు వీలు ఉంది. కానీ ఎందుకో జనసేన డేరింగ్ స్టెప్ వేయలేకపోయింది. ఈ పరిణామాల నేపధ్యంలో ఏపీలో 2024లో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకునే ఉత్సాహం అయితే జనాలలో కనిపించడంలేదు. వారు వద్దు వీరూ వద్దు అన్నట్లుగానే జనాలో రాజకీయ వైరాగ్యం ఉంది. మరి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళకైనా జనాల ను తమ వైపు తిప్పుకునేందుకు ఏ పార్టీ ఏమి చేస్తుందో చూడాలని అంటున్నారు.