Begin typing your search above and press return to search.

అమెరికన్ల మాట..ట్రంప్ తోనే కరోనా కల్లోలం!

By:  Tupaki Desk   |   17 April 2020 9:49 PM IST
అమెరికన్ల మాట..ట్రంప్ తోనే కరోనా కల్లోలం!
X
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి.. అగ్రరాజ్యం అమెరికాను తీవ్రంగా వణికిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా... చైనా కంటే కూడా అమెరికానే తీవ్రంగా వణికిస్తోందని కూడా చెప్పాలి. ఈ తరహా విపరిణామానికి కారణం ఎవరన్న మాటపై ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. అగ్రరాజ్యంగా ఫోజు కొడుతోన్న అమెరికాలో కరోనా విలయానికి ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపే కారణమని ఆ దేశ ప్రజలు ఇప్పుడు ముక్తకంఠంతో చెప్పేస్తున్నారు. కరోనా విలయానికి కారణం చైనా అంటూ ట్రంప్ తనదైన శైలి వ్యాఖ్యలు చేస్తుంటే... అమెరికన్లు మాత్రం ట్రంప్ ను దునుమాడేస్తున్నారు.

ఈ మేరకు ‘ప్యూ రీసెర్చి సెంటర్’ నిర్వహించిన ఓ సర్వేలో అమెరికన్లలో మెజారిటీ శాతం ట్రంప్ కారణంగానే దేశంలో కరోనా విలయతాండవం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ట్రంప్ అరికాలి మంట నెత్తికెక్కేదాకా ఎక్కేలా ఉన్న ఈ సర్వే నిజంగానే ఇప్పుడు కలకలంగా మారిందని చెప్పక తప్పదు. ఈ సర్వే ఎలా జరిగిందన్న విషయానికి వస్తే... ఈ సర్వేలో దాదాపు 4,917 మంది ప్రజలు పాల్గొని - తమ అభిప్రాయాన్ని తెలిపారు. సర్వే‌కు సంబంధించిన వివరాలను ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ గురువారం వెల్లడించింది. అగ్రరాజ్యంలో దావానలంలా కరోనా వైరస్ విజృంభించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలే కారణమని మెజార్టీ ప్రజలు నమ్ముతున్నట్లు ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ తెలిపింది.

కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ట్రంప్ వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నారని మీరు భావిస్తున్నారా? అని ప్రజలను అడగగా.. 65 శాతం మంది ప్రజలు ‘లేదు’ అని సమాధానం ఇచ్చారట. అంతేకాకుండా మహమ్మారి కారణంగా అమెరికా ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రశ్నించినప్పుడు.. అమెరికాపై వైరస్ ప్రభావం రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా ఉండబోతోందని నమ్ముతున్నామని దాదాపు 73 శాతం మంది అభిప్రాయపడ్డారట. ఇదిలా ఉంటే... అమెరికాలో ఇప్పటి వరకు 6.78లక్షల మంది కరోనా బారినపడగా.. 34,641 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారినపడిన వారి సంఖ్య 22 లక్షలకు చేరింది. మహమ్మారి కాటుకు ప్రపంచ వ్యాప్తంగా 1.48లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.