Begin typing your search above and press return to search.

అలుపెర‌గ‌ని బాట‌సారి.. క్ష‌మించు ఈ పాల‌కుల‌ను

By:  Tupaki Desk   |   20 May 2020 2:30 AM GMT
అలుపెర‌గ‌ని బాట‌సారి.. క్ష‌మించు ఈ పాల‌కుల‌ను
X
క‌నిపించ‌ని శ‌త్రువు ఆ వైరస్ మాన‌వ ప్ర‌పంచాన్ని చిదిమేస్తోంది. ఎంతో మేథ‌సంప‌న్నుడైన మానవుడిని ఇంటికే ప‌రిమితం చేసిన ఆ మ‌హ‌మ్మారి అడ్డుక‌ట్ట వేసేందుకు లాక్డౌన్ విధించారు. ఆ వైర‌స్ క‌ట్ట‌డికి లాక్‌డౌనే ప‌రిష్కార‌మ‌ని న‌మ్మి దాదాపు రెండు నెల‌ల పాటు భార‌త‌దేశాన్ని పూర్తిగా స్తంభించేశారు. దీంతో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఎక్క‌డి ప్ర‌జ‌లు అక్క‌డే ఉండిపోయారు. ఈ లాక్‌డౌన్‌తో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌తో పాటు ముఖ్యంగా వ‌ల‌స కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొట్ట‌చేత బ‌ట్టుకుని సొంత ప్రాంతాల్లో ప‌ని లేక ఇత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స వెళ్లారు. అక్క‌డ ప‌ని చేసుకుంటూ కొంత పొట్ట నింపుకుని పిల్లాపాప‌ల‌తో ఉంటున్నారు. వారికి లాక్‌డౌన్ ఒక శాపంగా మారింది. ప‌ని ప్రాంతంలో ఉపాధి లేక‌.. చేతిలో చిల్లీగ‌వ్వ లేక‌.. తిన‌లేక అగ‌చాట్లు ప‌డ‌డంతో ఆ బాధ‌లు త‌ట్టుకోలేక సొంత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లారు.

వారు వెళ్లేందుకు బ‌స్సులు, రైళ్లు ఎలాంటి ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించ‌క‌పోవ‌డంతో వారంతా కాళ్ల‌నే బ‌స్సు చ‌క్రాలుగా చేసుకుని త‌మ ప్రాంతాల‌కు ప‌య‌న‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు వెళ్తున్న చిత్రాల‌ను చూస్తుంటే క‌న్నీళ్లు రాక మాన‌దు. త‌ట్టాబుట్ట స‌ర్దుకుని పిల్లాపాప‌ల‌తో పాద‌యాత్ర‌గా వంద‌ల‌, వేల కిలోమీట‌ర్ల మేర న‌డుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు మ‌నం చూశాం.. చూస్తునే ఉన్నాం. పిల్లాడిని మోయ‌లేక వీల్ బ్యాగ్‌పై ప‌డుకోబెట్టి లాక్కెళ్తున్న చిత్రం.. పిల్ల‌ల‌ను మోయ‌లేక కావ‌డి క‌ట్టి చెరో ప‌క్క‌న ఇద్ద‌రిని ఉంచి తీసుకెళ్తున్న దృశ్యం.. లారీ వెళ్తూ చిన్నారిని ఎక్కిస్తూ ఓ తండ్రి ఒక చేయి లారీని ప‌ట్టుకుని.. మ‌రో చేయి పాప‌ను లారీలోకి తోస్తూ ఉన్న చిత్రాలు వారి దుస్థితిని చెబుతోంది.

వందల కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన, ఎర్రటి ఎండలో, చిన్నపిల్లలను ఎత్తుకుని వెళ్తున్న అలుపెరుగ‌ని బాట‌సారుల‌ను చూస్తుంటే ఇదేనా న‌వ భార‌త‌దేశం అనిపిస్తోంది. మ‌నం 2020 లోనే ఉన్నామా అనే ప్ర‌శ్న వ‌స్తోంది. పోలీసుల వేధింపులు, ప్రమాదాలు, ఆకలి బాధలు, దూపను త‌ట్టుకుని మ‌రి సొంతూళ్ల‌కు వెళ్తున్నారు. కాళ్ల నొప్పులు బాధిస్తున్నా, నడచీ నడిచీ అరికాళ్ల చర్మం ఊడుతున్నా వారి నడక ఆగలేదు. వారి క‌ష్టాలు చూస్తే ఎవ‌రి హృద‌య‌మైనా ద్ర‌విస్తుంది. అంత‌టి క‌ష్ట‌ప‌డి వెళ్తుంటే ఏ ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోలేదు. వారిని ఆపి మీకు ఇక్క‌డే ఉపాధి, తిండి, వ‌స‌తి కల్పిస్తామ‌ని భ‌రోసా ఇవ్వ‌లేక‌పోయాయి. దీంతో ప్ర‌భుత్వాల తీరుపై ప్ర‌జ‌ల‌తో పాటు స్వ‌చ్ఛంద సంస్థ‌లు, కార్మిక సంఘాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. విదేశాల నుంచి వ‌చ్చేవారికి విమానాలు ఏర్పాటుచేసి తీసుకురావొచ్చుగానీ స్వ‌దేశంలో కాలిన‌డ‌క‌న వెళ్తున్న వారికి వాహ‌నాలు క‌ల్పించ‌లేరా అనే ప్ర‌శ్న మొద‌ల‌వుతుంది. బ‌తుకు భార‌మై వెళ్తున్న కార్మికుల‌ను కాపాడలేని ప్ర‌భుత్వాలు ఎందుకనే ప్ర‌శ్న మాన‌వ హ‌క్కు కార్య‌క‌ర్తలు ప్ర‌శ్నిస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని లక్షలాది మంది వలస కార్మికుల క‌ష్టాల‌ను గుర్తించ‌క‌పోవ‌డం నిజంగా సిగ్గుచేటు. వారి క‌ష్టాలు చూసి అంత‌ర్జాతీయ స‌మాజం ప్ర‌శ్నిస్తోంది.

వలస కార్మికుల అంశంలో కేంద్ర ప్రభుత్వం ముందు చూపు లేకుండా వ్యవహరించడమే కాకుండా, రాష్ట్రాలకు పూర్తి మార్గదర్శకాలు చూపించకుండానే లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేయ‌డం ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. వ‌ల‌స కార్మికులు సొంత ప్రాంతాల‌కు వెళ్ల‌వ‌చ్చ‌ని ఒక ప్ర‌క‌ట‌న జారీ చేసి వ‌దిలేయ‌డం త‌ప్ప మార్గ‌దర్శ‌కాలు జారీ చేయ‌క‌పోవ‌డంతో ఈ ప‌రిస్థితి వ‌చ్చింది. ఒక‌ప్పుడు స్వాతంత్ర్య పోరాట స‌మ‌యంలో చూసిన ప‌రిస్థితులు మ‌ళ్లీ ఇప్పుడు దాపురించాయి. నిండు ఎండ‌లో రోడ్ల మీద వందలు, వేల కిలోమీటర్లు నడుస్తూ వారి స్వ‌గ్రామాల‌కు చేరుకుంటున్నారు. వారంతా ఆక‌లి, దాహం దిగ‌మింగుకుని మ‌రి ప‌య‌న‌మ‌య్యారు. ఈ విధంగా న‌డ‌క సాగిస్తూ 170 మందికి పైగా మరణించారని లెక్క‌లు చెబుతున్నాయి. ఇది భారతదేశంలో అత్యంత దౌర్భాగ్య‌పు ప‌రిస్థితి.