Begin typing your search above and press return to search.

వామ్మో వ్యాక్సినా .. మాకొద్దు , వణికిపోతున్న జనం!

By:  Tupaki Desk   |   26 Jan 2021 5:30 PM GMT
వామ్మో వ్యాక్సినా .. మాకొద్దు , వణికిపోతున్న జనం!
X
కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని వణికిపోయేలా చేసింది. దాదాపుగా ఏడాది కాలంగా ప్రపంచం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుపోయి అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే , ఇప్పుడిప్పుడే ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యి విజయవంతంగా సాగుతుంది. అయితే , కరోనా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు దేశంలోని మెజార్టీ ప్రజలు మొగ్గుచూపడం లేదు. తక్షణమే కరోనా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రస్తుతం 60శాతం మంది విముఖత చూపుతున్నారు.

వ్యాక్సిన్‌ తీసుకునేందుకు విముఖత చూపుతున్న వారి సంఖ్య గత 3 వారాల్లో 69 శాతం నుంచి 60 శాతానికి తగ్గిందని లోకల్ ‌సర్కిల్స్‌ చేపట్టిన సర్వేలో తేలింది. వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌ పై స్పష్టత కొరవడటమే వ్యాక్సిన్‌ పట్ల భయానికి ప్రధాన కారణమని సర్వే తెలిపింది. వ్యాక్సిన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్ వస్తాయనే‌ భయాలు, క్లినికల్‌ ట్రయల్స్‌ లో ప్రతికూల ఫలితాలు రావడం వంటి పరిణామాలతో గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన సర్వేలో 69 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకునేందుకు సానుకూలంగా లేరని తేలింది. జనవరి తొలి వారం వరకూ ఈ సంఖ్య అలాగే ఉంది.

అయితే ఇప్పుడు వ్యాక్సిన్‌ పట్ల విముఖత చూపేవారి సంఖ్య 60 శాతానికి తగ్గింది. వ్యాక్సిన్‌ తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎలా ఉంటాయనేది తెలియకపోవడంతోనే తాము వ్యాక్సిన్‌ తీసుకునేందుకు సిద్ధంగా లేమని సర్వేలో పాల్గొన్నవారిలో 59 శాతం మంది తెలిపారు. వ్యాక్సిన్‌ సామర్థ్యంపై అనిశ్చితితో తాము వ్యాక్సిన్‌ కు దూరంగా ఉంటామని 14 శాతం మంది వెల్లడించారు.