Begin typing your search above and press return to search.

డబ్బులొస్తాయని లైకులు కొడుతున్నారా.. పక్కా మోసం గురూ!

By:  Tupaki Desk   |   14 March 2023 9:00 PM GMT
డబ్బులొస్తాయని లైకులు కొడుతున్నారా.. పక్కా మోసం గురూ!
X
ఆధునిక టెక్నాలజీ ప్రవేశంతో మనకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. సమయం చాలా కలసి వస్తోంది. టెక్నాలజీ సాయంతో ఎన్నో పనులను ఇంటి నుంచే చేసుకోగలుగుతున్నాం. దీంతో డబ్బు కూడా ఆదా అవుతోంది. ఇదే సమయంలో నాణేనికి రెండో వైపు అన్నట్టు టెక్నాలజీని అందిపుచ్చుకున్న నేరగాళ్లు సైబర్‌ మోసాలకు పాల్పడుతూ నిలువునా ముంచేస్తున్నారు.

ఇలాగే పోస్టు చేసిన ఫేస్‌ బుక్, ట్విట్టర్, ఇనస్టాగ్రామ్, యూట్యూబ్‌ వీడియోలకు లైకులు కొడితే డబ్బులు ఇస్తామని గతంలో కొంతమంది ఎప్పటి నుంచో ఆశ చూపిస్తున్నారు. ఇప్పుడు ఇలాగే తమ యూట్యూబ్‌ వీడియోలకు లైకులు కొడితే డబ్బులు ఇస్తామంటూ నిలువునా ముంచేశారు.


యూట్యూబ్‌ లోని వీడియోకు లైక్‌ కొడితే ఒక్కో లైక్‌ కు రూ.50 ఇస్తున్నారు. ఇలా లైక్‌ కొట్టగానే అలా అకౌంట్లో డబ్బులు పడుతుండడంతో చాలా మంది దీన్ని నమ్మి లైకుల మీద లైకులు కొట్టి చివరికి లక్షల రూపాయల్లో మోసపోయారు.

ఇలా ఆరుగురు నుంచి మోసగాళ్లు సుమారు రూ.75 లక్షలు కొల్లగొట్టారు. దీంతో మోసపోయామని తెలుసుకుని లబోదిబోమన్న బాధితులు చివరకు సైబర్‌ క్రై మ్‌ పోలీసులను ఆశ్రయించారు.

ఈ నయా మోసం పూర్తి వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌ లోని భరత్‌ నగర్‌ కు చెందిన ఓ యువకుడు ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతడి వాట్సాప్‌ కు ఒక రోజు ఒక మెసేజ్‌ వచ్చింది. పార్ట్‌ టైమ్‌ జాబ్‌ ఉందని.. దాని సారాంశం. ఇది నిజమేనని నమ్మిన అతడు మెసేజ్‌ లో సూచించిన ఫోన్‌ నంబర్‌ కు వివరాల కోసం ఫోన్‌ చేశాడు. ఫోన్‌ ఎత్తిన అవతలి వ్యక్తి నుంచి పార్ట్‌ టైమ్‌ జాబ్‌ కు సంబంధించి వివరాలు అడిగాడు.

ఈ క్రమంలో తాము పంపే యూట్యూబ్‌ వీడియోలకు లైకులు కొట్టాలని.. ఒక్కో లైకుకు రూ.50 చొప్పున యువకుడి ఖాతాలో వేస్తామని మోసగాడు చెప్పాడు. దీనికి యువకుడు సరే అనడంతో కొన్ని యూట్యూబ్‌ లింకులు పంపారు. దీంతో అతడు వాటిని ఓపెన్‌ చేసి లైకులు కొడుతూ వచ్చాడు. ఈ క్రమంలో మొదట్లో యువకుడికి చెప్పినట్టు అతడికి డబ్బులు చెల్లించాడు. దీంతో యువకుడు వారిని పూర్తిగా నమ్మాడు. ఈ క్రమంలో మోసగాడు తమ కంపెనీల్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని యువకుడిని నమ్మించాడు. దీంతో యువకుడు నిందితుడికి డబ్బులు చెల్లిస్తూ వచ్చాడు. ఇలా మొత్తం మీద రూ.25 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత నేరగాడు అతడి ఫోన్‌ ను స్విచ్చాఫ్‌ చేసేసుకోవడంతో యువకుడికి అనుమానమొచ్చింది. తర్వాత తాను మోసపోయానని తెలుసుకుని లబోదిబోమంటూ సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు.

ఇదే తరహాలో హైదరాబాద్‌ నగరంలో యూసఫ్‌గూడ కు చెందిన వ్యక్తి నుంచి రూ.10 లక్షలు, మలక్‌ పేట వాసి నుంచి రూ.4 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ.2 లక్షలు స్వాహా చేశారు అలాగే హైదరాబాద్‌ కు కొత్తగా వచ్చిన ఓ రైతును కూడా మోసం చేశారు. రైతు నుంచి కూడా రూ.25 లక్షలు కాజేసి మొహం చాటేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.