Begin typing your search above and press return to search.

ఓట్లే వేసేందుకు నో.. ఎన్నికల్ని సామూహికంగా బహిష్కరించిన ఆ ఊరు ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   10 May 2023 5:12 PM GMT
ఓట్లే వేసేందుకు నో.. ఎన్నికల్ని సామూహికంగా బహిష్కరించిన ఆ ఊరు ఎక్కడంటే?
X
పోటాపోటీగా సాగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై యావత్ దేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మారిన బీజేపీకి ఎదురుదెబ్బ కర్ణాటక నుంచే మొదలవుతుందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. ఆ వాదనలోనిజం లేదని.. తాము మరింత బలోపేతం కావటం ఖాయమన్న ధీమాను కమలనాథులు వ్యక్తం చేస్తున్నారు. పోటాపోటీగా సాగుతూ.. కాంగ్రెస్.. బీజేపీలకు డూ ఆర్ డై అన్న పరిస్థితుల్లో పోలింగ్ భారీగా ఉంటుందని భావించారు. కానీ.. అందుకు భిన్నంగా ఓటర్లు పెద్దగా ఓటు వేసేందుకు ఆసక్తిని చూపించకపోవటం చర్చగా మారింది.

ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం మూడు గంటలకు కూడా మందకొడిగా సాగటం తెలిసిందే. మధ్యాహ్నం ఒంటిగంట వేళకు కేవలం 37 శాతమే పోల్ అయ్యింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఓట్లు వేసేందుకు ఒక్కరంటే ఒక్కరుకూడా ముందుకు రాకపోవటం సంచలనంగా మారింది. చామరాజనగర జిల్లాలోని గుండ్లపేట తాలుకాలో ఉన్న ''చిక్క ఎలచెట్టి'' అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని ప్రభుత్వ స్కూల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు.

అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉండే ఈ గ్రామంలో సరైన వసతులు లేని పరిస్థితి. ఎన్నికల వేళలో మాత్రమే నాయకులకు ఈ ఊరుగుర్తుకు వస్తుంది. అందుకే.. ఈసారి తాము ఓటుహక్కు వినియోగించుకోకూడదని నిర్ణయించారు.

అందుకు తగ్గట్లే.. ఎన్నికల నిర్వాహణకు వచ్చిన అధికారులతో గ్రామస్తులు తాము ఓటు వేసే ఆలోచన లేదని తేల్చి చెప్పటంతో షాక్ తిన్నారు. అయినప్పటికి తమ పని తాము చేయాలన్నట్లుగా వారు ఈ రోజు (బుధవారం) ఉదయం ఏడు గంటలకే పోలింగ్ సిద్ధం చేశారు. అయితే.. మధ్యాహ్నం వరకు ఒక్కరంటే ఒక్క ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయకపోవటం ఆసక్తికరంగా మారింది.

సమస్యలకు నెలవుగా ఉండే తమ గ్రామాన్ని పట్టించుకోని నేతల తీరుతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న గ్రామస్థులు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ఊరికి వచ్చిన పలువురు పార్టీ నేతల్ని ''పోరారే పోరా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేయటంతో వారు గ్రామం వైపు చూసే ధైర్యం చేయలేదంటున్నారు.

తమ విషయంలో పార్టీలు.. నేతలు వ్యవహరిస్తున్న వైఖరితో ఆగ్రహంతో ఉన్న ఓటర్లు ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఓటర్ల తీరుతో ఇప్పటివరకు ఆ గ్రామం పేరు తెలియని తీరుకు భిన్నంగా ఇప్పుడు.. కర్నాటకలో ''చిక్క ఎలచెట్టి'' ఊరు గురించి మాట్లాడుకోవటం మొదలైంది.