Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్ని వణికిస్తున్న చలిగాలి

By:  Tupaki Desk   |   22 Dec 2021 4:48 AM GMT
తెలుగు రాష్ట్రాల్ని వణికిస్తున్న చలిగాలి
X
ఒకే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడూ లేనంత చలి కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గజగజలాడించే చలి దెబ్బకు రెండు రాష్ట్రాలు పిచ్చ కూల్ అయిపోవటమే కాదు.. పలువురికి ఇబ్బందికరంగా మారింది. అనుకుంటాం కానీ ఎండలు బాగా ఉంటే.. కాసింత ఏసీ వేసుకొని అడ్జెస్ట్ కావొచ్చు. కానీ.. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వణకటం మినహా చేయగలిగింది లేదు. కొన్ని ఇళ్లలో ఉండే రూంహీటర్ తెలుగు ప్రజల వాడకం తక్కువనే చెప్పాలి. అందుకే.. అల్మారాలో దాచి ఉంచి స్వెట్టర్లను బయటకు తీసి ధరిస్తున్నారు.

తెల్లారటం తర్వాత.. ఉదయం పది గంటల వరకు తీవ్రమైన చలితో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తెగ ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ సాయంత్రం ఐదు గంటలకే వాతావరణం మొత్తం మారిపోవటం.. ఆరు దాటిన తర్వాత చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. రాత్రి పది గంటల సమయంలో ఇంటి తలుపులు.. కిటికీలు అన్ని మూసేసినా కూడా వణుకు పుట్టిస్తున్న చలికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు వీచే చల్లగాలులు.. ప్రాణానికి పరీక్షగా మారాయి.

ఈ పరిణామాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే.. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గడిచిన ఐదారు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత 3.5 డిగ్రీలకు పడిపోయింది. సిర్పూర్ లో 4 డిగ్రీలకు.. వాంకిడిలో 5 డిగ్రీలు.. మాంగృడ్‌లో 5.1 డిగ్రీలకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇదే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ లోకి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆ మాటకు వస్తే ఉమ్మడి అదిలాబాద్ మాత్రమే కాదు.. కరీంనగర్.. హైదరాబాద్ తో సహా.. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. దీంతో.. సాయంత్రం అయితే చాలు పెద్ద వయస్కులు బయటకు రావటానికి గజగజ వణికిపోతున్నారు.

ఇక.. ఏపీ విషయానికి వస్తే.. విశాఖ ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. విశాఖ ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో 3.5 డిగ్రీల నుంచి 5 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి. చాలా కొద్ది ప్రాంతాల్లోనే 6 నుంచ 8 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతోంది. చల్లదనానికి పెట్టింది పేరైనా చిత్తూరు జిల్లా హార్సిలీ హిల్స్ లో కనిష్ఠ ఉష్ణోగ్రత 7.1 డిగ్రీలుగా నమోదు అయితే.. వేడికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే విజయవాడ.. గుంటూరులో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఇక్కడ 13.8 డిగ్రీల సెల్సియస్ గా చెబుతున్నారు. చాలా కాలం తర్వాత ఈ స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు చెబుతున్నారు. కర్నూలులోనూ 13.6 డిగ్రీలుగా నమోదైంది.

రెండు రాష్ట్రాల్లో వణికించే చలి కారణంగా.. కొన్ని వ్యాపారాలు.. ఉద్యోగాలు చేసే వారికి తీవ్ర అసౌకర్యంగా మారుతోంది. తెల్లవారుజామునే పనులు చేసుకునే పారిశుద్ధ్య కార్మికులు.. పాల వ్యాపారం చేసే వాళ్లు.. హోటల్ సిబ్బందితో పాటు.. ప్రయాణాలు చేసే వారికి మహా ఇబ్బందిగా మారింది. చలి తీవ్రతఇంత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశం ఉందని.. అలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరికొన్ని రోజులు ఈ చలి పులితో ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.