Begin typing your search above and press return to search.

బాబు స‌ర్కారుకు పెనుమాక రైతులు షాకిచ్చారే!

By:  Tupaki Desk   |   20 July 2017 8:02 AM GMT
బాబు స‌ర్కారుకు పెనుమాక రైతులు షాకిచ్చారే!
X
న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం అతి త‌క్కువ కాలంలోనే 33 వేల ఎక‌రాల‌ను రైతులే స్వ‌చ్ఛందంగా ఇచ్చార‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు స‌ర్కారుకు ఈ వార్త నిజంగా షాకిచ్చేదే. ఎందుకంటే... మెజారిటీ రైతుల‌ను బ‌తిమాలో, బామాలో, భ‌య‌పెట్టో చంద్ర‌బాబు స‌ర్కారు త‌మ దారికి తెచ్చుకుంద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న త‌రుణంలో రాజ‌ధాని ప‌రిధిలోని పెనుమాక రైతులు మాత్రం బాబు స‌ర్కారు బెదిరింపుల‌కు లొంగ‌లేదు. అంతేనా... త‌మ అభ్యంత‌రాల‌ను నివృత్తి చేస్తే త‌ప్పించి భూములు ఇచ్చే ప్ర‌సక్తే లేద‌ని కూడా తేల్చేశారు. ఈ నేపథ్యంలో రాజ‌ధాని నిర్మాణానికి బాబు స‌ర్కారు ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన సీఆర్డీఏ అధికారులు నిర్వ‌హించిన స‌భ‌లు, స‌మావేశాల‌కు తాము వెళ్ల‌బోమ‌ని తాజాగా పెనుమాక రైతులు స్ప‌ష్టం చేశారు.

స్ప‌ష్టం చేయ‌డ‌మంటే.. తాము సీఆర్డీఏ స‌భ‌ల‌కు రాబోమ‌ని ఎవ‌రితోనో చెప్పి పంపారులే అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే ఈ విష‌యాన్ని రైతులంతా కూడ‌బ‌లుక్కుని సీఆర్డీఏ అధికారుల‌తో పాటు చంద్ర‌బాబు స‌ర్కారు చెవుల్లో మారుమోగేలా డ‌ప్పు చాటింపు వేయించారు. నేటి ఉద‌యం స‌మావేశం ఉంద‌ని, ఈ స‌మావేశానికి రైతులంతా హాజ‌రుకావాల‌ని ఇదివ‌ర‌కే సీఆర్డీఏ విజ్ఞ‌ప్తి చేసింది. అయితే నేటి ఉద‌యం డ‌ప్పు చేత‌బ‌ట్టుకుని పెనుమాక వీధుల్లోకి వ‌చ్చేసిన ఓ వ్య‌క్తి.. సీఆర్డీఏ మీటింగుల‌ను, ఆ మీటింగుల‌కు హాజ‌రుకాబోమ‌ని రైతులంతా క‌లిసిక‌ట్టుగా తీసుకున్న కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. స‌ద‌రు మీటింగుల‌కు రైతులుగా తాము ఎందుకు వెళ్ల‌డం లేద‌న్న విష‌యాన్ని కూడా రైతులు ఆ చాటింపు ద్వారానే బ‌హిర్గ‌తం చేశారు.

ప్రస్తుతం ఇప్పుడు ఈ డ‌ప్పు చాటింపు వీడియో వైర‌ల్ గా మారిపోయింది. ఆ చాటింపు వివ‌రాల్లోకెళితే... ఇకపై సీఆర్డీఏ అధికారులు ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేసినా హాజరుకాకూడదని గ్రామస్తులు నిర్ణయించారు. రెండేళ్లలో చాలాసార్లు అభ్యంతరాలు ఇచ్చామని, అధికారులు ఏ ఒక్కటీ పట్టించుకోలేదని.. పైగా సమావేశాలకు పిలిచి అక్రమ కేసులు పెడుతున్నారని పెనుమాక రైతులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నాలు చేయడాన్ని ఖండించారు. మ‌రి ఈ చాటింపు సందేశంపై బాబు స‌ర్కారు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.