Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్ : పెనుకొండ.. ఎవరికి అండ..

By:  Tupaki Desk   |   27 March 2019 4:24 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్ : పెనుకొండ.. ఎవరికి అండ..
X
– బీసీ ఓటర్లదే తుది నిర్ణయం

– మళ్లీ కురుబల మధ్యనే పోరు

పాతికేళ్లుగా ప్రభావం చూపుతున్న తెలుగుదేశం పార్టీకి ఈసారి బీటలు తప్పవని తెలుస్తోంది. పెనుకొండ నియోజకవర్గం గెలుపులో బీసీలదే తుది నిర్ణయం. ఇన్నాళ్లూ టీడీపీ వైపు ఉన్న బీసీ ఓటర్లు వైఎస్సార్‌ సీపీ మొగ్గు చూపుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదని గ్రహించిన ఓటర్లు ఈసారి టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారు. గత 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన బీకే పార్థసారథి ఐదేళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. దీనికి తోడు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కియా కార్ల కంపెనీలో పలు అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే స్థానికులకు ఉపాధి కల్పించలేదు. తక్కువ ధరకే భూములు లాక్కొని కార్ల కంపెనీకి అమ్మడంలో టీడీపీ నాయకులది ప్రముఖ పాత్ర ఉందని వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రచారం చేశారు. అసలు విషయాలను జనాలకు తీసుకెళ్లారు. ఫలితంగా ఈసారి బీకే పార్థసారథి ఓటమి ఖాయమని తెలుస్తోంది. అదేవిధంగా వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తగా ఉన్న మాలగుండ్ల శంకర్‌ నారాయణ గెలుపు సులువు అని భావించవచ్చు.

మూడు పర్యాయాలుగా కురుబల మధ్యనే పోరు

పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా కురుబ సముదాయానికి చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా కురుబ సముదాయానికి చెందిన వారినే బరిలో దింపుతున్నారు. 2009 నుంచి 2019 వరకు ప్రతిసారీ ప్రధాన పార్టీల నుంచి కురుబ సముదాయానికి చెందిన వారే పోటీ చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ టీడీపీ వైపు ఉన్న కురుబ సముదాయం ఇటీవల వైఎస్సార్‌ సీపీ వైపు మొగ్గు చూపింది. టికెట్ల కేటాయింపులో కూడా కురుబలను టీడీపీ మోసం చేసిందనే భావన నెలకొంది. వైఎస్సార్‌ సీపీ జిల్లాలో కురుబలకు ఎంపీ - రెండు ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వడంతో ఆకర్షితులయ్యారు. ఫలితంగా పార్టీ ప్రభావం కూడా తారస్థాయికి చేరుకుంది. దీంతో టీడీపీకి చెక్‌ పెట్టి వైఎస్సార్‌ సీపీ గెలుపు కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

1994 నుంచి టీడీపీ హవా

గత 1994 నుంచి పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తూ వస్తోంది. పరిటాల రవీంద్ర తొలిసారిగా టీడీపీ తరఫున పెనుకొండ నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. అనంతరం 1999 - 2004 ఎన్నికల్లో కూడా ఆయనే గెలిచారు. ఆయన మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి పరిటాల సునీతమ్మ గెలిచారు. అయితే నియోజకవర్గాల పునర్‌ విభజనలో భాగంగా పరిటాల కుటుంబం రాప్తాడుకు తరలిపోగా.. పెనుకొండకు బీసీ నాయకుడు.. మాజీ ఎంపీ బీకే పార్థసారథి రేసులోకి వచ్చారు. 2009లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2014లో కూడా విజయం సాధించారు. అయితే ఈసారి ఫలితం తారుమారు కానుందని సమాచారం. కురుబ సముదాయానికి చెందిన వారు వైఎస్సార్‌సీపీ వైపు ఆకర్షితులు కావడమే కారణంగా చెప్పవచ్చు.

2009 ఎన్నికలు

టీడీపీ – బీకే పార్థసారథి (కురుబ)
కాంగ్రెస్‌ – కేటీ శ్రీధర్‌ (కురుబ)
ప్రజారాజ్యం – రమేశ్‌ బాబు (కురుబ)

2014

టీడీపీ – బీకే పార్థసారథి (కురుబ)
వైఎస్సార్‌ సీపీ – ఎం.శంకర్‌ నారాయణ (కురుబ)

2019

టీడీపీ – బీకే పార్థసారథి (కురుబ)
వైఎస్సార్‌ సీపీ – ఎం.శంకర్‌ నారాయణ (కురుబ)