Begin typing your search above and press return to search.

పార్లమెంటులో మాటిచ్చినా గాలికొదిలేస్తున్నారు

By:  Tupaki Desk   |   4 April 2016 11:30 AM GMT
పార్లమెంటులో మాటిచ్చినా గాలికొదిలేస్తున్నారు
X
రాజకీయ పార్టీ హామీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ర్టాల్లోనే కాదు - దేశంలోనే కాదు - ప్రపంచవ్యాప్తంగా హామీలను గాలికొదిలేసే అలవాటు ఉంది. ఎన్నికల సమయంలో పెద్దపెద్ద హామీలు చెప్పి ఆ తరువాత చేతులెత్తేయడం పార్టీలకు అలవాటే. అధికారంలోకి వచ్చిన పార్టీని ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో అవకాశం దొరికినప్పుడంతా విమర్శిస్తుంటాయి. అయితే భారతదేశంలో ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలే కాదు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా గాలికొదిలేస్తున్నాయట. దీనికి సంబంధించిన గణాంకాలు చూస్తే మతిపోవడం ఖాయం. ప్రస్తుత 16వ లోక్ సభలో ఇచ్చిన హామీలు - చెప్పిన మాటల్లో ఇప్పటికీ 53 శాతం కార్యరూపం దాల్చలేదట. 15వ లోక్ సభ విషయానికొస్తే ఇది 19 శాతంగా ఉంది.

2009-14 మధ్య కాలంలో 15వ లోక్ సభలో అప్పటి మంత్రులు - ప్రధాని ఇచ్చిన హామీల్లో 19 శాతం నెరవేరలేదట. ప్రస్తుత లోక్ సభలో మంత్రులు - ప్రధాని ఇచ్చిన హామీల్లో 53 శాతం అమలుకు నోచుకోకపోగా.. పెద్దల సభలో ఇచ్చిన హామీల్లో 11 శాతం పెండింగులో ఉన్నాయి.

పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో.. బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు జరిగే చర్చల్లో - తీర్మానాల సందర్భంలో.. ఇలా వివిధ సందర్భాల్లో మంత్రులు - ప్రధాని హామీలు - వాగ్దానాలు చేస్తుంటారు. వీటిని నిర్ణీత కాలంలో నెరవేర్చేందుకు, పరిష్కరించేందుకు పార్లమెంటు కమిటీ కూడా ఉంటుంది.

కాగా 14 - 15 - 16వ లోక్ సభలను పరిశీలిస్తే హామీలను ఎలా గాలికొదిలేశారో తెలుస్తుంది. 2004-09 మధ్య 14వ లోక్ సభలో ప్రభుత్వ హామీల్లో 55.20 శాతం పెండింగులో ఉన్నాయట. 15వ లోక్ సభలో 2009-14 మధ్య 18.80 శాతం హామీలు ఉత్త మాటలుగానే ఉండిపోయాయి. ఇక ప్రస్తుత మోడీ ప్రభుత్వం విషయానికొస్తే 52.90 శాతం పెండింగులో ఉన్నాయి.

యూపీఏ-2 ప్రభుత్వంలో..

- 15వ లోక్ సభలో 5807 హామీలిస్తే 4453 పరిష్కరించారు. 196 అమలు చేయాల్సిన అవసరం లేదని తేల్చారు. 1094 మాత్రం పెండింగులోనే ఉండిపోయాయి.

- ముఖ్యంగా అయిదుగురు మంత్రుల పరిధిలోనే 40 శాతం పెండింగు హామీలున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి - పర్యావరణ - పంచాయతీరాజ్ - యువజన వ్యవహారాలు - నైపుణ్యాభివృద్ధి మంత్రులు హామీలు అమలుకు నోచుకోలేదు.

- 15వ లోక్ సభలో శాఖల వారీగా చూస్తే... మైనారిటీ వ్యవహారాల ల్లో 30.4 శాతం, పబ్లిక్ గ్రీవెన్సు పింఛన్లలో 33.7 శాతం, లా అండ్ జస్టిస్ పరంగా 35.4 శాతం పెండింగులో ఉన్నాయి. అత్యధికంగా పార్లమెంటరీ వ్యవహారాలు - నైపుణ్యాభివృద్ధి శాఖల్లో ఒక్కటి కూడా అమలు కాలేదు. అంటే 100 శాతం పెండింగన్నమాట. క్రీడలు-యువజన శాఖలో 44.2... పంచాయతీరాజ్ లో 43.8... పర్యావరణ - అటవీ శాఖలో 41.4 శాతం పెండింగే.

మోడీ ప్రభుత్వంలో...

ప్రస్తుత 16వ లోక్ సభలో సుమారు 53 శాతం పెండింగు హామీలున్నాయి. తాజా సమావేశాల్లో ఇచ్చినవాటికి ఇంకా సమయం ఉండడంతో పెండింగు శాతం అదికంగా ఉంది. ఇంతవరకు మొత్తం 2071 హామీలు ఇవ్వగా 948 పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యాయి. 10 పనికిరానివి... 1095 పెండింగులో - పరిశీలనలో ఉన్నాయి.

సెషన్సు వారీగా చూస్తే...

- 2014 జులై-ఆగస్టు మధ్య జరిగిన రెండో సెషన్సులో 41.4 శాతం పెండింగులో ఉన్నాయి. అదే ఏడాది నవంబరు - డిసెంబరు మధ్య జరిగిన మూడో సెషన్సులో 50.9 శాతం... 2015 ఫిబ్రవరి నుంచిజరిగిన నాలుగో సెషన్సులో57.3... 2015 జులై - ఆగస్టులో జరిగిన అయిదో సెషన్సులో 71.5 శాతం ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి.

- ముఖ్యంగా ప్రధాని కార్యాలయం పరిధిలోని హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదు. 100 శాతం పెండింగులో ఉన్నాయి. స్టాటిస్టిక్సు ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ విభాగంలోనూ 100 శాతం పెండింగులో ఉన్నాయి. మిగతా శాఖల్లోనూ భారీగా పెండింగులో ఉన్నాయి.

రాజ్యసభ లెక్కేంటి?

రాజ్యసభలో ఇంతవరకు 16034 హామీలు ఇవ్వగా 13257 పరిష్కారమయ్యాయి. 989 వద్దనుకున్నారు. 1788 పెండింగులో ఉన్నాయి. రాజ్యసభలో ఇచ్చిన హామీల్లో 15 మంత్రిత్వ శాఖలు 100 శాతం పరిష్కరించగా నాలుగు మంత్రిత్వ శాఖలు మాత్రం 90 శాతానికి పైగా పెండింగులో ఉంచాయి.

--- గరుడ