Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్షాల‌కు.. `పెగాస‌స్ పాశుప‌తాస్త్రం`... మోడీకి చుక్క‌లేనా?

By:  Tupaki Desk   |   31 Jan 2022 12:30 AM GMT
ప్ర‌తిప‌క్షాల‌కు.. `పెగాస‌స్ పాశుప‌తాస్త్రం`... మోడీకి చుక్క‌లేనా?
X
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ను సభ ముందు ఉంచనున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ జరుగుతున్న సమావేశాల్లో పెగసస్ నిఘా వ్యవహారం, నిరుద్యోగం సహా పలు అంశాలలో కేంద్రం తీరును ఎండగట్టేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తాజాగా వెలుగు చూసిన పెగా స‌స్ నిఘా వ్య‌వ‌హారం.. ప్ర‌తిప‌క్షాల‌కు పాశుప‌తాస్త్రంగా మార‌నుంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షాన్ని పలు అంశాలలో నిలదీయడానికి విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నా యి. గత వారమే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో పార్టీ పార్లమెంటరీ నాయకులు వర్చువల్‌గా సమావేశమై ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. భావసారూప్య పార్టీలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సభలో పోరాడాలని నిర్ణయించారు. పెగసస్ నిఘా వ్యవహారం, రైతాంగ సంక్షోభం, తూర్పు లద్ధాఖ్‌లో చైనా చొరబాట్లు, కొవిడ్ బాధితులకు పరిహారం, ఎయిర్‌ ఇండియా అమ్మకం, నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు.

రైల్వే ఉద్యోగాల నియామకాలపై యూపీ, బిహార్‌ రాష్ట్రాల్లో యువత పెద్ద ఎత్తున చేస్తున్న ఆందోళనను సభలోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తోంది. అయితే.. వీట‌న్నింటికంటే ఎక్కువ‌గా మోడీ స‌ర్కారును ఇరుకున పెట్టేందుకు పెగాస‌స్‌ను వినియోగించుకోవాల‌ని.. కాంగ్రెస్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. పెగసస్ స్పైవేర్ను భారత్ 2017లోనే కొనుగోలు చేసిందని అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ సంచనల కథనం వెలువ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో దీనిపై ఇప్ప‌టికే అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌లు పేలుతున్నాయి. అయితే.. పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఇది మ‌ళ్లీ వివాదంగా మార‌నుంది.

ముఖ్యంగా పార్ల‌మెంటులోనే ఈ అంశం మరోమారు తెరపైకి రానుంది. పెగసస్ విషయంలో కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి సభను తప్పుదోవ పట్టించారని, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి లేఖ రాశారు. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల్లో మాట‌ల తూటాలే కాకుండా.. విమ‌ర్శ‌లు, స‌వాళ్ల శ‌త‌ఘ్నులు సైతం పేల‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.