Begin typing your search above and press return to search.

అన్ని శాఖలూ నావేనంటున్న మంత్రి

By:  Tupaki Desk   |   13 July 2015 6:18 AM GMT
అన్ని శాఖలూ నావేనంటున్న మంత్రి
X
ఏపీ మంత్రి పీతల సుజాత తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. మంత్రి పదవి వచ్చిన తొలినాళ్లలోనే ఆమె వడ్డాణం బహుమతిగా తీసుకున్నారన్న ఆరోపణలతో వార్తలకెక్కారు. ఆ తరువాత ఆమె ఇంటివద్ద పది లక్షల నగదుతో సంచి దొరకడం కలకలం రేపింది. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు. తనది కాని శాఖల్లో తలదూర్చారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ వివాదాస్పద భూమి విషయంలో ఫైలు కావాలంటూ అధికారులపై ఆమె ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీతల సుజాత స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో పాటు గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు... అయితే.. ఆమె అడుగుతున్న ఫైలు మాత్రం అటవీ, రెవెన్యూ శాఖల కు సంబంధించింది. ఆ రెండు శాఖల మధ్య ఏర్పడిన సరిహద్దు వివాదానికి సంబంధించిన వ్యవహారంలో ఆమె తలదూరుస్తున్నట్లు తెలుస్తోంది.

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం నామవరం గ్రామంలో 47 ఎకరాల భూమిపై వివాదం ఉంది. ఈ భూమిలో రెవెన్యూ అధికారులు ప్రయివేటు వ్యక్తులకు పట్టాలు ఇచ్చారని.. కానీ నిజానికి ఇది తమ శాఖ భూమి అని పేర్కొంటూ అటవీ శాఖ ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ వివాదం కొనసాగుతోంది. ఈ భూమి పైన అటవీ, రెవెన్యూ, సర్వే శాఖలు జాయింట్ సర్వే చేపట్టి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సర్వే కొనసగుతోంది. చింతలపూడి ఎమ్మెల్యే అయిన మంత్రి పీతల సుజాత ఈ సమస్య పరిష్కారానికి సర్వే నివేదిక కోరడం, దానికి సంబంధించిన ఫైలును అడుగుతున్నారు. అయితే... ఒక ఎమ్మెల్యేగా అయినా... వేరే శాఖకు చెందిన మంత్రిగా అయినా ఆమె ఇందులో తలదూర్చరాదన్న వాదన వినిపిస్తోంది. అయినా శాఖల మధ్య గొడవలో ఆమెకు ఉన్న ఆసక్తి ఏమిటో అర్థం కావడంలేదంటున్నారు ఆయా శాఖల అధికారులు. దీనిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని కూడా వారు అనుకుంటున్నట్లు సమాచారం.