Begin typing your search above and press return to search.

వెంకయ్య విషయంలో తొందరపాటు అవసరమా పెద్దిరెడ్డి?

By:  Tupaki Desk   |   13 Feb 2021 6:30 AM GMT
వెంకయ్య విషయంలో తొందరపాటు అవసరమా పెద్దిరెడ్డి?
X
కొన్ని విషయాల్లోకి కొందరి ప్రస్తావన తీసుకురాకుండా ఉండటానికి మించిన మంచి పని మరొకటి ఉండదు. కానీ.. ఆ విషయాన్ని మర్చిపోవటం ద్వారా తప్పుల తిప్పలు ఎదుర్కోవాల్సిన దుస్థితి. ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యుడు.. సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి ఉదంతమే దీనికి నిదర్శనం. ఉప రాష్ట్రపతి.. రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వెంకయ్యనాయుడిపై విజయసాయి దూకుడుతో వ్యాఖ్యలు చేశారు.

దీనిపై అన్ని పార్టీలకు చెందిన నేతలు విజయసాయి మాటల్ని ఖండిస్తూ.. అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. దిగి వచ్చిన విజయసాయి.. ఉప రాష్ట్రపతి వెంకయ్యను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవటమే కాదు.. జరిగిన దానికి చింతిస్తున్నానని.. మరోసారి అలాంటి పరిస్థితి రిపీట్ కాకుండా జాగ్రత్త పడతానని పేర్కొన్నారు. ఇదంతా తొందరపాటుతో చేసిన వ్యాఖ్యల ఫలితమనే విషయాన్ని మర్చిపోకూడదు.

ఈ ఉదంతం జరిగి మూడు.. నాలుగు రోజులు కూడా కాక ముందే.. మరోసారి వైసీపీకి చెందిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. పోస్కో సంస్థ విశాఖ స్టీల్ కొనుగోలు చేసే విషయంలో ఆసక్తి ఉందన్న వార్తలు వెలువుడుతున్న వేళ.. విపక్ష నేత చంద్రబాబు ఘాటు ఆరోపణలు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాబు తీరును తప్పు పట్టటం వరకు ఓకే. కానీ.. ఈ ఇష్యూలోకి ఉప రాష్ట్రపతి వెంకయ్యను తీసుకురావాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. తమ మీదా..తమ ప్రభుత్వం మీదా.. తమ ముఖ్యమంత్రి మీదా విమర్శలు.. ఆరోపణలుచేసే వారిని తిప్పికొట్టటం ఓకే అయనా.. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని లాగాల్సిన అవసరం లేదు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గతంలో విశాఖ ఉద్యమ వేళలో కీలకంగా వ్యవహరించారని.. ఇప్పుడు కూడా కేంద్రంతో చెప్పి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పెద్దిరెడ్డి ఈ తరహా సలహాలు.. సూచనలు ఇవ్వాలంటే ముందుగా.. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు.. చేపట్టిన కార్యాచరణ గురించి ప్రజలకు అర్థమయ్యేలా చేయాలి. అందుకు వివిధ దశాల్లో ఆందోళనలు.. పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే వేరే వారిని సాయం కోరితే బాగుంటుంది. అందుకు భిన్నంగా పోస్కో కంపెనీకి సర్టిఫికేట్లు ఇచ్చేసి.. ఉప రాష్ట్రపతి స్థానంలో ఉన్న వారి సాయం అడిగితే సబబుగా ఉంటుంది. అంతే తప్పించి.. ఉత్తినే అంత పెద్ద స్థాయి నేతను లాగటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా మిస్ అవుతారేంటి పెద్దిరెడ్డి. వెనుకా ముందు ఆలోచించకుండా మాట్లాడితే.. విజయసాయి మాదిరి చింతిస్తూ ప్రకటన విడుదల చేయాల్సి వస్తుందన్నది పెద్దిరెడ్డి మాష్టారు ఎప్పటికి గర్తిస్తారో?