Begin typing your search above and press return to search.

మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా మోడీ.. ఇప్పుడేమిటీ మౌనం?

By:  Tupaki Desk   |   19 April 2021 5:59 AM GMT
మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా మోడీ.. ఇప్పుడేమిటీ మౌనం?
X
యావత్ దేశం ఇప్పుడు ఆరోగ్య విపత్తులో పడిపోయింది. పెద్ద ఎత్తున పెరుగుతున్న కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొదటి వేవ్ లో చూడని ఎన్నో దారుణాలకు నిలువెత్తు రూపంగా నిలుస్తోంది సెకండ్ వేవ్. కరోనా ఆరంభంలో పాలకులు కఠిన చర్యలు తీసుకోవటంతో.. కేసుల నమోదు.. వైరస్ వ్యాప్తి అంతో ఇంతో కంట్రోల్ లో ఉండేది. మొదటి వేవ్ మొత్తంలో రోజులో గరిష్ఠంగా నమోదైన కేసులు లక్ష లోపు మాత్రమే. ఇప్పుడుపరిస్థితి మారిపోయింది. రోజు తిరిగేసరికి తక్కువలో తక్కువగా మూడు లక్షల లోపు కేసులు వచ్చేస్తున్నాయి. రానున్న వారంలో నాలుగు లక్షలు.. రెండో వారానికి ఐదు లక్షల చొప్పున కేసులు నమోదయ్యే పరిస్థితి. ప్రస్తుత పరిస్థితే చూసుకుంటు.. రానున్న రోజుల్లో దారుణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్నమాట వినిపిస్తోంది.

మొదటి వేవ్ సందర్భంగా ప్రధాని మోడీ మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కేసీఆర్.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు మీడియా సమావేశాల్ని ఏర్పాటు చేసి.. అప్పటికి ఉన్న తాజా పరిస్థితితో పాటు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వివరించేవారు. సమస్య.. దానికున్న పరిష్కారాన్ని చెప్పే పరిస్థితి. నిజానికి వారి మాటలతో ఏదో అద్భుతాలు జరిగిపోతాయన్నది లేకున్నా.. అంతో ఇంతో గుండె దిటువును కలిగించేవి.

ఈసారి ఏమైందో ఏమో కానీ.. ఇప్పటివరకు.. ఇంత భారీగా కేసులు నమోదు అవుతున్న వేళ.. ప్రధాని మోడీ కానీ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరూ మీడియా ముందుకు వచ్చింది లేదు. తమ ధైర్యవచనాలతో ప్రజలకు సాంత్వన కలిగించింది లేదు. మిగిలిన సమయాల్లో ఎలా ఉన్నా.. విపత్తు విరుచుకుపడిన వేళ.. ప్రజల్లో అంతకంతకూ భయాందోళనలు తీవ్రమవుతున్న సమయంలో.. వారికి అండగా ఉన్నామన్న ధీమాతో పాటు.. ప్రజల గురించే తామ ఆలోచిస్తున్నామన్న భావన కలిగేలా నాలుగు మాటలు చెబితే సొమ్ములేమన్నా పోతాయా మోడీ.. కేసీఆర్.. జగన్?