Begin typing your search above and press return to search.

ఏపీ తమ్ముళ్లకు స్ఫూర్తినిస్తున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   11 Feb 2016 10:30 PM GMT
ఏపీ తమ్ముళ్లకు స్ఫూర్తినిస్తున్న కేసీఆర్
X
పక్కోడి తెలివితేటల్ని కాపీ చేయటం కూడా ఒకరకమైన తెలివితేటలే. రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ.. పనికొచ్చే తెలివితేటల్ని వదిలేయటం ఎందుకని అనుకున్నారో కానీ.. ఏపీ తమ్ముళ్లు సరికొత్త ప్రచారం మొదలు పెట్టారు. ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా తెలంగాణలో కిందామీదా పడుతున్న తమ్ముళ్లు.. ఏపీలో అంతకంతకూ ప్రత్యర్థి పార్టీ మీద ప్రతీకారం తీర్చుకోవాలన్నట్లుగా ఉన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా.. బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలు పంచుకోవటానికే పార్టీ మారారంటూ ప్రచారం చేసే కేసీఆర్ అండ్ కో మాదిరే.. ఏపీ తమ్ముళ్లు సరికొత్త రాగం ఆలపిస్తున్నారు.

నవ్యాంద్ర పునర్ నిర్మాణంలో భాగస్వామ్యం చేసుకోవటం కోసం ఎవరితోనైనా జట్టు కడతామని చెబుతున్నారు. తెలంగాణలో తమకు ఎదురైన షాక్ ల నుంచి తేరుకోవాలని భావిస్తున్నారో ఏమో కానీ.. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు సైకిల్ ఎక్కేందుకు సంప్రదింపులు జరుపుతున్నారంటూ వెల్లడించారు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్.

జగన్ ను ఆయన పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్యేలే భరించలేకపోతున్నారని.. అందుకే పార్టీ మారాలని భావిస్తున్నట్లు చెబుతున్న పయ్యావుల.. నవ్యాంధ్ర పునర్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకుంటే ఎవరికైనా స్వాగతం పలుకుతామని చెబుతున్నారు. చూస్తుంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాటల్ని కాస్త మార్చి.. తమకు తగ్గట్లుగా తమ్ముళ్లు రాగాలు మారుస్తున్నట్లు కనిపించట్లేదు..?