Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో సెల్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రూ.10వేలు ఫైన్

By:  Tupaki Desk   |   1 Aug 2020 6:10 AM GMT
ఆ రాష్ట్రంలో సెల్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రూ.10వేలు ఫైన్
X
దేశంలోని చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫైన్లు వేసే విషయంలో ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తారు. దూకుడుగా వెళదామని అస్సలు అనుకోరు. రోజువారీగా ప్రజలు చేసే తప్పులకు భారీ ఎత్తున జరిమానాలు విధించటం ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న విషయాన్ని గుర్తించి.. చూసిచూడనట్లుగా వ్యవహరిస్తుంటారు. టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాలో ఆయన ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ప్రజల మైండ్ సెట్ మార్చేందుకు..నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి భారీగా ఫైన్లు వేస్తూ వారిలో మార్పు కోసం తపన పడటం చూస్తాం.

సినిమాల్లో చూసేందుకు ఇవన్నీ బాగున్నా.. వాస్తవంలో మాత్రం భారీ ఎత్తున ఫైన్లు వేసేందుకు ఏ ప్రజా ప్రభుత్వం ముందుకు రాదు. అందుకు భిన్నంగా కొంతకాలంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యవహరిస్తున్నారు. రోడ్డు భద్రతా నిబంధనల్ని కఠినతరం చేయటమే కాదు.. నిబంధనల్ని ఉల్లంఘించిన వారికి దిమ్మ తిరిగిపోయేలా ఫైన్లు వేస్తూసంచలనంగా మారారు.

ఆ మధ్యనే మద్యం మత్తులో వాహనాలు నడిపినా.. అంబులెన్సులకు దారి ఇవ్వకుండా వాహనాలు డ్రైవ్ చేసినా.. వారికి రూ.10వేలు చొప్పున ఫైన్లు వేస్తున్నారు. తాజాగా ఈ భారీ ఫైన్లకు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాల్ని నడపటంపైనా కన్నెర్ర చేశారు. ఈ తప్పు చేసిన వారికి రూ.10వేలు జరిమానా విధించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అచ్చం సినిమాల్లో మాదిరి భారీ ఎత్తున విధిస్తున్న ఈ ఫైన్లతో యూపీలో రోడ్డు ప్రమాదాలు తగ్గటంతో పాటు.. ప్రజల్లో మార్పు ఏమైనా వస్తుందా? అన్నది చూడాలి. ఏమైనా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న ఆందోళనకు గురి కాకుండా.. దమ్ముగా తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.