Begin typing your search above and press return to search.

కుప్పంలో పుట్టిన వన్ సైడ్ లవ్ కి పవన్ రియాక్షన్... ?

By:  Tupaki Desk   |   7 Jan 2022 1:32 PM GMT
కుప్పంలో పుట్టిన వన్ సైడ్ లవ్ కి పవన్ రియాక్షన్... ?
X
అపుడెపుడో వచ్చిన అల్లు అర్జున్ ఆర్య మూవీలో వన్ సైడ్ లవ్ గురించి గొప్పగా చెప్పాడు డైరెక్టర్ సుక్కూ. ఇపుడు చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో కూడా వన్ సైడ్ లవ్ ట్రాక్ నడుస్తోందా అన్న చర్చ ఉంది. కుప్పం టూర్లో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తమ్ముళ్ళూ మన వైపు నుంచి ఎంత లవ్వున్నా అవతల వైపు నుంచి కూడా ఉండాలి కదా అంటూ బాబు వన్ సైడ్ లవ్ మీద మాంచి లెక్చర్ ఇచ్చారు.

అంటే తాను జనసేన మీద మనసు పారేసుకున్నానని బాబు చెప్పకనే చెప్పారు. సరే జనసేన విషయంలో బాబు పక్కా క్లారిటీగా ఉన్నారు. తమ ప్రేమ లేఖ బహిరంగ సభలోనే రాసేశారు. మరి పవన్ రియాక్షన్ ఏంటి అని అంతా ఎదురుచూస్తున్న వేళ ఆయన తన లవ్వు ఎవరి మీదనో చెప్పేశారు. ఆయన ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఏర్పడిన ఆటంకం మీద స్పందించారు.

మోడీ ఈ దేశానికి ప్రధాని. ఆయన జాతికి నాయకుడు. అంతా గౌరవించాల్సిందే అంటూ పవన్ మాట్లాడారు. ప్రధాని విషయంలో జరిగిన భద్రతాపరమైన లోపాలను కూడా ఆయన ఎండగట్టారు. ప్రధానికి భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాల ధర్మం అని కూడా చెప్పుకొచ్చారు. ఈ టోటల్ ఎపిసోడ్ లో ప్రధాని మోదీ హుందాగా వ్యవహరించారని కూడా ప్రశంసించారు.

మొత్తానికి చంద్రబాబు జనసేనతో వన్ సైడ్ లవ్ గురించి ప్రకటన చేసి ఇరవై నాలుగు గంటలు తిరిగేలోపే పవన్ కళ్యాణ్ తనదైన రియాక్షన్ ఇచ్చేశారు అంటున్నారు. పవన్ కి ప్రధాని మోడీ అంటే గౌరవం. అభిమానం, ప్రేమ అన్నీ ఉన్నాయి. ఆయన దాన్ని చాలా సార్లు చెప్పుకున్నారు. ఇపుడు బీజేపేతో జనసేన పొత్తు కూడా కొనసాగుతోంది.

అయితే ఇప్పటిదాకా బీజేపీ నుంచి జనసేన వేరు పడి పోతుందని, టీడీపీతో జతకడుతుందని రకరకాలుగా ప్రచారం చేశారు. అయితే సందర్భం వచ్చిన ప్రతీసారి పవన్ మోదీని మెచ్చుకుంటూనే ఉన్నారు. ఆయన విధానలకు మద్దతు ఇస్తూనే ఉన్నారు. బాసటగా నిలుస్తూనే ఉన్నారు. అలా తనకు మోడీ మీద బీజేపీ మీద ఉన్న ప్రేమను చాటుకుంటూనే ఉన్నారు.

మరి చంద్రబాబు అంటే బీజేపీ మండిపడుతోంది. ఆ పార్టీతో పొత్తు వద్దు అనుకుంటోంది. బాబు కూడా పవన్ తన వెంట ఉంటే చాలు అనుకుంటున్నారు. ఇలా బాబు పవన్ కి లవ్ సిగ్నల్స్ ఇస్తే బీజేపీ సోము వీర్రాజు వీరావేశం ఎత్తేశారు. పవన్ మావాడే అనేశారు. పవన్ సైతం మోడీని సపోర్టుగా ఇపుడు ట్వీట్ చేయడం ద్వారా ఏపీ పాలిటిక్స్ లో తాను ఎటువైపో చెప్పేశారు. మరి బాబు లవ్ వన్ సైడ్ గానే ఉంటుందా లేక ఏమైనా మార్పులు జరగవచ్చా అంటే ఇంకా చాలా టైమ్ ఉంది కాబట్టి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి కుప్పంలో పుట్టిన వన్ సైడ్ లవ్ కి పవన్ తనదైన రియాక్షన్ తో తెరదించారు అనే అంటున్నారు అంతా.