Begin typing your search above and press return to search.

పవన్... పక్కా లోకల్... ?

By:  Tupaki Desk   |   18 Oct 2021 3:30 PM GMT
పవన్... పక్కా లోకల్... ?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో ఒకేసారి రాణిస్తున్నారు. ఆయన వరసబెట్టి సినిమాలు కూడా చేస్తున్నారు. దాంతో పవన్ పక్కా లోకల్ అంటే అదేదో కొత్త సినిమా టైటిల్ అనుకునే ప్రమాదం ఉంది. కానీ విషయం అది కాదు, ఈ టైటిల్ రాజకీయ తెర మీద తొందరలో మెరియనుంది. అవును పవన్ కళ్యాణ్ తాను పక్కా లోకలే అంటున్నారు. ఇంతకీ ఆయన్ని కాదన్న వారు ఎవరూ అంటే వైసీపీ వారే ఆ మాట అంటున్నారు. పవన్ ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని ప్రెస్ నోట్లూ ట్వీట్లు చేస్తారు, ఏపీకి ఆయనకు అసలు సంబంధం ఏంటి అంటూ హాట్ హాట్ కామెంట్స్ తో వైసీపీ నేతలు తగులుకుంటున్నారు. వారు అంటున్నట్లుగానే పవన్ కూడా చేస్తున్నారు. ఆయన చుట్టపు చూపుగా ఏపీకి వచ్చి పోతున్నారు అన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో కూడా ఉన్నాయి.

పవన్ నెలకో రెండు నెలలకో అలా ఏపీకి  వచ్చి ఒకటి రెండు మీటింగులు పెడితే జనసేన ఏ విధంగా ఎత్తిగిల్లుతుంది అన్న వారూ ఉన్నారు. దాంతో పవన్ కి ఈ మాటలు బాగానే తగిలాయనుకోవాలేమో. అందుకే ఆయన తాజాగా కీలకమైన నిర్ణయం తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. చాలా తొందరలో ఆయన తన మకాం మొత్తం విజయవాడకు మార్చుతారు అంటున్నారు. అంటే పవన్ ఇకపైన ఆంధ్రా గడ్డ మీదనే ఉంటూ ఇక్కడ నుంచే పాలిటిక్స్ చేస్తారు అన్న మాట. ఒక విధంగా ఇది జనసైనికులకు ఆనందం కలిగించే విషయంగానే చూడాలి. ఎందుకంటే తమ అధినాయకుడు నిత్యం తమకు అందుబాటులో ఉంటారు, తమ సమస్యలు కూడా ఆయనతో నేరుగా చెప్పుకోవచ్చు. మొత్తానికి పవన్ డెసిషన్ కనుక అమలైతే జనసేనకు మంచి రోజులు వచ్చినట్లే అంటున్నారు.

అయితే అదే సమయంలో పవన్ కొత్త సినిమాలు, షూటింగుల సంగతేంటి అన్న చర్చ కూడా వస్తోంది. పవన్ చేతిలో అరడజన్ దాకా సినిమాలు ఇపుడు  ఉన్నాయి. ఆయన ఓకే అని చెప్పాలే కానీ చాలా మంది నిర్మాతలు క్యూ కట్టడం ఖాయం. మరి పవన్ కమిట్ అయిన సినిమాలను ఎలా పూర్తి చేస్తారు అన్న ప్రశ్న కూడా వస్తోంది. అయితే పవన్ రానున్న కాలమంగా ఇక పాలిటిక్స్ కే అంటున్నారుట. అందువల్ల ఆయన కమిట్ అయిన సినిమాల్లో కొన్నింటికి కట్ చేసుకుంటారు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అదే కనుక నిజమైతే పవన్ మళ్లీ వెండితెరకు విరామం ఇచ్చేసినట్లే. మొత్తానికి పవన్ కనుక ఏపీ రాజకీయ రాజధాని విజయవాడ నడిబొడ్డున ఉంటే మాత్రం ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయమనే అంటున్నారు.