Begin typing your search above and press return to search.

ఉదయం విరుచుకుపడి.. రాత్రికి మా ఎస్ఐ భీమ్లా నాయక్ లంటూ కవరింగ్

By:  Tupaki Desk   |   3 Oct 2021 5:18 AM GMT
ఉదయం విరుచుకుపడి.. రాత్రికి మా ఎస్ఐ భీమ్లా నాయక్ లంటూ కవరింగ్
X
'అడుసు తొక్కనేల.. కాలు కడగనేల' అన్న సామెత గుర్తుకు వచ్చేలా ఉంది జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు చూస్తుంటే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతికూల పరిస్థితులు మామూలే. ఇప్పుడు తిరుగులేని అధినేతలా ఏపీలో చెలామణీ అవుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం.. విపక్షంలో ఉన్నప్పుడు నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖకు వెళితే.. రన్ వే నుంచి బయటకు పోనివ్వకుండా పోలీసులు పెద్ద ఎత్తున అడ్డుకోవటం.. ఆ సందర్భంలో ఆగ్రహంతో ఆందోళన చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై జగన్మోహన్ రెడ్డి మండిపడటం అప్పట్లో బ్రేకింగ్ న్యూస్ గా వచ్చింది.

ఇక్కడ పవన్ కు.. జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏమిటంటే.. విశాఖ ఎయిర్ పోర్టులో తనకు ఎదురైన పరిస్థితికి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భంలో.. అయ్యో జగన్ కు ఎంత కష్టం వచ్చింది? ఎందుకింతలా వేధిస్తున్నారు? ఇదంతా పవర్ లేనందుకే కదా? అదే ఆయనకు అధికారాన్ని కట్టబెడితే ఇలాంటి ఇబ్బందులకు గురి కారు కదా? అన్న భావన ప్రజల్లో కలిగేలా చేసింది. ప్రతికూల పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే తీరు ఇది.

ఇందుకు భిన్నంగా గాంధీ జయంతి రోజున ఉదయం రాజమండ్రి.. రాత్రికి అనంతపురంలో పర్యటించిన పవన్ కల్యాణ్.. రెండు సందర్భాల్లో వేర్వేరు తీరులో రియాక్టు కావటం గమనార్హం. రాజమండ్రిలో తాను చేసే నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ తన వాహనం పైకి వచ్చి.. ఆవేశంతో ఊగిపోయిన పవన్ వీడియోలు వైరల్ గా మారాయి. ఆవేశం హద్దులు దాటితే ఎలా ఉంటుందన్న విషయం మొన్నటికి మొన్న సినిమా కార్యక్రమంలో అభిమాని మీద చూపించిన పవన్.. తాజాగా రాజమండ్రిలో పోలీసుల మీద ప్రదర్శించారు.

తానో పోలీస్ కానిస్టేబుల్ కొడుకునని.. ఏ కానిస్టేబుల్ ను చూసినా.. తనకు తన తండ్రి గుర్తుకు వస్తారని పవన్ చెబుతారు. అదే నిజమైనప్పుడు.. పోలీసుల మీద అంతలా ఎలా విరుచుకుపడ్డారు? అన్నది ప్రశ్న. ఉదయం రాజమండ్రిలో పోలీసులపై ఫైర్ అయిన పవన్.. రాత్రికి అనంతపురంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. పోలీసులకు వెన్న రాసేలా మాట్లాడటం గమనార్హం. కానిస్టేబుళ్లను తన తండ్రితో పోల్చి.. ఎస్ఐలను తాను చేస్తున్న భీమ్లానాయక్ లతో పోల్చిన వైనం చూస్తే.. పొద్దున అంతలా విరుచుకుపడటం ఎందుకు? రాత్రికి ఇంతలా కవర్ చేయటం ఎందుకు? ఎందుకీ తిప్పలు అన్న భావన కలుగక మానదు.