Begin typing your search above and press return to search.

పొత్తుల గురించి పవన్ కుండబద్దలు కొట్టేసినట్టేనా?

By:  Tupaki Desk   |   5 Jun 2022 5:30 AM GMT
పొత్తుల గురించి పవన్ కుండబద్దలు కొట్టేసినట్టేనా?
X
ఆంధ్రప్రదేశ్ లో 2024లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పొత్తులకు తెరలేపారు. జూన్ 4న గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ పొత్తులపై విస్పష్ట ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని.. వాటిలో ఒకటి జనసేన-బీజేపీ-టీడీపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, రెండోది.. జనసేన-టీడీపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మూడోది.. జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం అని పార్టీ నేతలకు పవన్ వెల్లడించారు.

2014లో రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము తగ్గి టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చామని, 2019లో ఒక స్టేట్మెంట్ కోసం తాము తగ్గామని ఈసారి (2024లో) మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదని పవన్ చెప్పడం విశేషం. ఇక తగ్గాల్సింది మిగతా వాళ్లేనని.. అన్యాపదేశంగా బీజేపీ, టీడీపీ కోర్టులోకి బాల్ నెట్టారు. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును బైబిల్ లో ఒక సూక్తి ఉందని.. దాన్ని ఈసారి మిగతా పార్టీలు పాటించాలని పవన్ కోరారు. ముఖ్యంగా టీడీపీ.. బైబిల్ సూక్తిని పాటించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము ఏకపక్షంగా ఒకరికి మద్దతివ్వడం వంటివి చేయబోమని పవన్ విస్పష్ట ప్రకటన చేశారు. సమాన సీట్లలో ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటే అధికారాన్ని సమానంగా పంచుకోవడమే ఉంటుందన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఒకప్పుడు పొత్తుల విషయంలో మాట్లాడుతూ తమది వన్ సైడ్ లవ్ అన్నారని.. ఇప్పుడు మాత్రం వార్ వన్ సైడ్ అంటున్నారని పవన్ గుర్తు చేశారు. ముందు చంద్రబాబు ఏం చెప్తారో చూడాల్సి ఉందన్నారు. అలాగే రాష్ట్ర బీజేపీ నేతలతో తాను టచ్ లో లేనని.. తన పరిచయాలన్నీ కేంద్ర బీజేపీ నేతలతోనేని చెప్పారు. ఇప్పటివరకు తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని బీజేపీ అధిష్టానం చెప్పలేదని స్పష్టం చేశారు. తాను కూడా దినపత్రికల్లో చూసే తనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుసుకున్నానన్నారు.
మరోవైపు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తద్వారా ఏపీలో అవినీతిని అంతం చేసి సుస్థిర పాలనను అందిస్తామని వివరించారు. కాగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ ప్రస్తుతం మౌనం దాల్చింది. పవన్ వ్యాఖ్యలను విశ్లేషించే పనిలో ప్రస్తుతం ఆ పార్టీ ఉంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ మరోమారు చెప్పిన సంగతి తెలిసిందే.

కాగా టీడీపీ ఇటీవల నిర్వహించిన మహానాడు విజయవంతం కావడంతో మంచి ఆనందంలో ఉంది. మహానాడు టీడీపీ ఊహించినదానికంటే భారీగా సక్సెస్ కావడంతో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని ఆ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్సీపీ మీద ప్రజల్లో వ్యతిరేకత భారీగా పెరిగే అవకాశముందని నమ్ముతోంది. మహానాడు విజయవంతం కావడం వెనుక ప్రధాన కారణం ప్రభుత్వ వ్యతిరేకతేనని టీడీపీ బలంగా విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తులపై అప్పుడే తొందరపడకూడదని, ఆచితూచి వ్యవహరించాలని టీడీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.