Begin typing your search above and press return to search.

కొత్త రాజకీయమేది పవన్ సారూ... ?

By:  Tupaki Desk   |   12 Dec 2021 12:30 PM GMT
కొత్త రాజకీయమేది పవన్ సారూ... ?
X
పవన్ కళ్యాణ్. సినిమా నటుడు కమ్ రాజకీయ నేత. ఆయనకు నచ్చితే దూకుడుగా రాజకీయం చేస్తారు. లేకపోతే మేకప్ వేసుకుని సినిమాలు తీసుకుంటారు అన్న విమర్శలు ప్రత్యర్ధులు తరచూ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే గత ఏడేళ్లలో పవన్ ఎన్నో మాటలు చెప్పారు. అందులో సగటు జనాలకు ఎన్ని నచ్చాయో తెలియదు కానీ మేధావులకు, విద్యావంతులకు, ఈ రొచ్చు రాజకీయాలు మారాలి అనుకునే వారికి మాత్రం పవన్ అప్పట్లో చెప్పిన వాటిలో కొన్ని బాగా నచ్చేశాయి.

ఆనాడు పవన్ తాను రాజకీయాల్లో కొత్త విధానాన్ని తీసుకువస్తానని చెప్పారు. అంతే కాదు, ప్రత్యర్ధులను విమర్శించమని, తిట్ల పురాణాలు అసలు ఉండవని కూడా చెప్పుకున్నారు. ఇక తమకు అధికారం ముఖ్యమే కానీ దాని కోసం షార్ట్ కట్ మెదడ్స్ వెతకమని కూడా పేర్కొన్నారు. ఇక రాజకీయాల్లో ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ కేవలం నెగివిటీ నుంచే పవర్ ని సొంతం చేసుకునే గేమ్స్ కి దూరమని కూడా అన్నారు. అయితే పవన్ ఆలోచనలకు ఆచరణకు తేడాను కొద్ది కాలంలోనే గ్రహించేశారనుకోవాలి.

అందుకే ఆయన కేవలం పార్టీ పెట్టిన ఏడేళ్లలోనే ఎన్నో పార్టీలతో పుత్తు పెట్టుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి. అవన్నీ ఎలా ఉన్నా ఏపీ విభజన వల్ల గాయపడిన రాష్ట్రం. ఏపీలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆ రెండు పార్టీలు కేంద్రాన్ని కనీసమాత్రంగా కూడా నిలదీయలేక తమ సొంత పాలిటిక్స్ నే చేసుకుంటూ పోతున్నాయన్న విమర్శలు అయితే ఉన్నాయి.

దాంతో మూడవ పార్టీగా జనసేన మీద కొద్దో గొప్పో ఆశలు అయితే ఉన్నాయి. కానీ జనసేనాని కూడా అదే రూట్లో వెళ్తున్నారు అన్న చర్చ ఉంది. ఆయన సైతం సమస్యను దాన్ని మూలాలను చూడడం లేదు, పరిష్కారాన్ని కూడా ఆలోచించడం లేదు, ఆయన సైతం ఒక రాజకీయ చట్రంలో ఇరుక్కుపోయి తన బలాన్ని, ఇమేజ్ ని పరిమితం చేసుకోవడమే రాజకీయ విషాదంగా చూడాల్సి ఉంటుందేమో.

ఏపీలో జనసేన ఫ్రెష్ గా వచ్చిన పార్టీ. ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. ఇక పవన్ మీద వ్యక్తిగతంగా కానీ ఇతరత్రా కానీ ఏ రకమైన ఆరోపణలు లేవు. ఆయన మీద అవినీతి మకిలి అన్నది లేదు. ఆయన డేరింగ్ అండ్ డేషింగ్ లీడర్ అని కూడా ఈ రోజుకీ జనాల్లో నమ్మకం ఉంది. అలాంటి పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి కీలకమైన సమస్య మీద పోరాటం చేయడానికి సిద్ధపడడం హర్షించతగిన విషయం.

కానీ పవన్ తన పోరాటాన్ని ఢిల్లీ మీద ఎక్కుపెట్టకుండా ఏపీ గల్లీకే పరిమితం కావడమే బాధాకరమని ప్రజా సంఘాలు, ఉద్యమకారుల నుంచి వస్తున్న నిర్వేదమైన భావన. పవన్ లాంటి వారు, బీజేపీతో పొత్తు ఉన్న వారు సొంతంగా ఒక డెలిగేషన్ ని కేంద్ర మంత్రుల వద్దకు తీసుకెళ్ళి ముఖాముఖీ చర్చలు పెడితే ఆ రిజల్టే వేరుగా ఉంటుంది అన్న మాటా ఉంది. అదే టైమ్లో ఫార్టీ ఇయ‌ర్స్ ఇండస్ట్రీలు, అధికారంలో ఉన్న వారు చేయలేని పని తాను చేసినట్లుగా చెప్పుకోవచ్చు జనాలు సైతం హర్షిస్తారు. వారికి కూడా ఎవరు మొనగాడో అర్ధమవుతుంది. మరి అలాంటి రాచబాటను వదిలిపెట్టేసి విశాఖ ప్లాంట్ విషయంలో పవన్ మంగళగిరిలో దీక్ష చేస్తే ఎంతవరకూ సమస్య పరిష్కారం అవుతుంది అన్నదే ప్రశ్న.

అయితే ఇక్కడ జనసేనకు పేరు రావచ్చు. రాజకీయంగా మైలేజ్ కూడా రావచ్చు. అంటే అచ్చం ఇతర ట్రెడిషనల్ పార్టీల మాదిరిగానేనా పవన్ మార్క్ రాజకీయం సాగుతోందా అంటే జవాబు ఏమొస్తుందో. ఏది ఏమైనా కొత్త రకం రాజకీయం అంటే అకాశాన్ని భూమిని కలిపేయనవసరం లేదు, ఉన్న పార్టీల విధానలకు కాస్తా తేడాగా ఉంటూ జనం గుండె చప్పుడుని వింటే చాలు. కానీ ఫ్రెష్ గా పాలిటిక్స్ లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ణి కూడా ఈ రొచ్చు రాజకీయం మార్చేసిందా లేక ఆయనే కొత్త వద్దు పాత ముద్దు అని అటే అడుగులు వేస్తున్నాడా అన్నడే ఆలోచించాల్సిన విషయం.