Begin typing your search above and press return to search.

జగన్ అంటే కోపం లేదా పవన్...?

By:  Tupaki Desk   |   12 July 2023 9:35 PM GMT
జగన్ అంటే కోపం లేదా పవన్...?
X
ఈ మాట పదే పదే పవన్ ఎందుకు చెబుతున్నారు అన్నదే కీలకమైన ప్రశ్న. నాకు జగన్ మీద ఎలాంటి కోపం లేదని ఇప్పటికి చాలా సార్లు పవన్ చెప్పి ఉంటారు. ఇదే మాటను చంద్రబాబు ఎపుడూ అనలేదు. అలాగే జగన్ కూడా చంద్రబాబు మీద తనకు కోపం వ్యక్తిగతంగా లేదు అని ఏనాడూ చెప్పలేదు. అలాగే పవన్ విషయంలో కూడా ఆయన పేరు పెట్టే మాట్లాడరు.

మరి ఒక్క పవనే ఇలా ఎందుకు చెప్పుకుంటున్నారు. అది మీడియా మీటింగ్ అయినా బహిరంగ సభ అయినా లేక పార్టీ సమావేశం అయినా పవన్ ఎందుకు అంతలా వివరణ ఇవ్వాలని చూస్తున్నారు అన్నది బిగ్ క్వశ్చన్. దాన్ని కనుక తరచి చూస్తే చాలా విషయాలూ విశ్లేషణలు ఎన్నో ఉంటాయి.

నాకు జగన్ మీద ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు ఆయన ప్రభుత్వ విధానాల మీదనే నా పోరాటం అని పవన్ అనేకసార్లు చెప్పుకొచ్చారు. కానీ పవన్ చెప్పిన మాటలకు చేతలకు మధ్య పోలిక అయితే ఉండడంలేదు. ఇటీవల ఏలూరులో ఆయన వారాహి రధమెక్కి చేసిన తాజా ప్రసంగమే చూస్తే జగన్ని ఏ మాత్రం గౌరవించను అన్నారు, ఏక వచనంతో పిలుస్తాను అన్నారు. మరి ఇది ఏ రకమైన స్టేట్మెంట్ అని అడుగుతున్నారు.

విధానాల మీద పోరాటం అయితే వ్యక్తుల విషయంలో ఎందుకు ఈ పిలుపుల మధ్య మర్యాదల మధ్య తేడా ఉండాలి అన్నది ఒక ప్రశ్న. అంతే కాదు జగన్ ఒక క్రిమినల్ అని ఏపీకి ఆయన సీఎం అవడం సిగ్గుచేటు అంటూ అనేక వ్యక్తిగత విమర్శలు చేస్తూ వస్తున్నారు పవన్. నిన్నటికి నిన్న జగన్ని పట్టుకుని హిట్లర్ తో పోల్చేశారు.

సరే చంద్రబాబు కూడా జగన్ని సైకో అంటున్నారు కదా. ఏకంగా రాక్షసుడు రావణాసురుడు అంటున్నారు కదా పవన్ ఇలాంటివి అంటే తప్పేంటి అనుకోవచ్చు. ఇక్కడ తేడా ఉంది. బాబు చేసినా జగన్ చేసినా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తున్నారు. వారు ఆయా పార్టీలు ఓడాలని చూస్తున్నారు. రాజకీయంగా తేల్చుకోవాలని అనుకుంటున్నారు. అంతే తప్ప జగన్ చంద్రబాబుని ముసలాయన అన్నా వెన్నుపోటు వీరుడు అన్నా రాజకీయ పరిభాషలోనే ఉంటోంది

జనాలు కూడా అలాగే అర్ధం చేసుకుంటున్నారు. ఇక పవన్ విషయంలోనే ఈ చిక్కు వస్తోంది. దానికి కారణం ఆయన 2014 నుంచి జగన్ మీదనే తన బాణాలను అన్నీ గురి పెట్టి ఉండడం. ఆనాడు చంద్రబాబు సీఎం గా ఉన్నా కూడా జగన్ మీదనే పవన్ ఆరోపణలు చేస్తూ వచ్చారు. విమర్శించారు. అవినీతి ఆరోపణలు చేశారు.

ఇపుడు ఎటూ జగన్ సీఎం కాబట్టి విమర్శలు చేస్తున్నారు. అయితే జగన్ అంటే పవన్ కి ఏదో వ్యక్తిగతంగా ఉంది కాబట్టే ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు అన్నది జనాలలోకి బలంగా వెళ్ళిపోయింది. విమర్శలు అన్నవి నిర్మాణాత్మకంగా లేకపోతే అదే బాధ. అవసరం అయినపుడు చేసే విమర్శలకు బలం ఎక్కువ. అలా కాకుండా వ్యక్తి టార్గెట్ గా చేసే విమర్శలు కానీ రాజకీయం కానీ తగిన ఫలితాలు ఇవ్వదు అని అంటున్నారు.

పవన్ అయితే జగన్ మీద ఇంత ధాటీగా గట్టిగా ఆరోపణలు విమర్శలు ఎక్కుపెడుతున్నా జనాలలోకి అవి దూసుకుని పోవడంలేదు. దాంతోనే పవన్ తనకు జగన్ అంటే వ్యక్తిగత ద్వేషం లేదు అని అంటున్నారు. ఇలా ఆయన ఎంత సంజాయిషీ ఇచ్చినా ఆయన చేతలు ఆ దిశగా నమ్మకం కలిగించకపోతే ఇబ్బందే అంటున్నారు. ఏపీ రాజకీయాలలో జగన్ పాలన నాలుగేళ్ళుగా సాగుతోంది, అంతకు ముందు చంద్రబాబు పాలనలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి.

వాటిని ఇదే తీరున నిలదీసి ఉంటే జగన్ పట్ల పవన్ కి కోపం లేదని అంతా అనుకునేవారు. కానీ నాడు సున్నితంగా బాబు సర్కార్ మీద అదీ చివరి ఏణ్ణర్ధంలో విమర్శలు చేసి ఊరుకున్న పవన్ జగన్ పవర్ లోకివచ్చిన వెంటనే ఘాటైన విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. అందుకే మంత్రులు రోజా, గుడివాడ అమరనాధ్ వంటి వారు జగన్ మీద పవన్ కి ఎందుకు అంత ద్వేషం కోపం అని ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని లాంటి వారు కూడా జగన్ని మాత్రమే విమర్శించడానికి పవన్ మీటింగులు పెడతారు అని తేల్చేస్తున్నారు.

ఇక వైసీపీ నేత పోసాని క్రిష్ణ మురళి లాంటి వారు అయితే జగన్ మీద కక్షని, కోపాన్ని పవన్ వీడాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ వారికే ఈ అభిప్రాయం ఉంటే తప్పు లేదు కానీ జనాల్లో మాత్రం జగన్ అంటే పవన్ కి ఎందుకో పడదు అన్న భావన అయితే ఈ తొమ్మిదేళ్ళ విభజిత ఏపీ రాజకీయాల్లో వెళ్ళిపోయింది.

మరి పవన్ తన పోరాటం పాలసీల మీదనే జగన్ మీద కాదు అంటే తన పరుష పదజాలాని ఆపి సమస్యల మీద రెట్టించిన ఊపుతో మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే ఒక విమర్శ చేసినపుడు అన్నీ ఆలోచించి సమగ్రంగా చేయాల్సి ఉంటుంది అని సూచిస్తున్నారు. మరి జగన్ అంటే కోపం లేదు అని పవన్ చెప్పిన మాటలను జనాలు నమ్ముతున్నారా అంటే వేచి చూడాల్సిందే.