Begin typing your search above and press return to search.

హీరోలందరూ పవన్ కి మద్దతు ఇస్తారా...?

By:  Tupaki Desk   |   19 Jun 2023 10:06 AM GMT
హీరోలందరూ పవన్ కి మద్దతు ఇస్తారా...?
X
సినీ రంగం నుంచి వచ్చిన చాలా మంది హీరోలు ఒంటరిగానే పోరాడారు. ఎన్టీయార్ సైతం అదే చేశారు. ఆయన టీడీపీ పెట్టినపుడు ఏయన్నార్ ని కూడా తనతో పాలిటిక్స్ లోకి రమ్మన్నట్లుగా ప్రచారం సాగింది. అయితే ఏయన్నార్ నో చెప్పారని అంటారు. అలా ఎన్టీయార్ రాజకీయాల్లోకి సోలోగా వచ్చారు. ఆయనకు ఎదురు నిలిచి పోరాడింది మరో సూపర్ స్టార్ క్రిష్ణ. అలా ఫైటింగ్ సాగుతూ వచ్చింది. మిగిలిన హీరోలు అంతా సినిమాలు ఎవరివి వారు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే చిరంజీవి పార్టీ పెట్టినపుడు కూడా సినీ రంగం నుంచి పెద్దగా మద్దతు దక్కింది లేదు. అంతవరకూ ఎందుకు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో జనసేన తరఫున సొంతంగా పోటీ చేసినపుడు సైతం సినీ మద్దతు కోరలేదు. అయితే ఈసారి పవన్ వ్యూహాత్మకంగా వెళ్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన వారాహీ యాత్రలో భాగంగా చేస్తున్న ప్రసంగాలు చూస్తే సినీ రంగం నుంచి నూరు శాతం మద్దతు కోరుకుంటున్నట్లుగా ఉంది.

ఆయన కత్తిపూడి మీటింగులోనే కోట్లాది మంది ప్రజల నుంచి మన్ననలు అందుకునే హీరోల చేత దండం పెట్టించుకున్నారు అని సీఎం జగన్ మీద విమర్శలు చేశారు ఆ తరువాత పిఠాపురం సభలో అయితే తనకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, చిరంజీవి సహా అందరు హీరోల సైనిమాలు ఇష్టమే అని రాజకీయాల్లో ఉన్న తనకు ఆయా హీరోల అభిమానులు మదతు ఇవ్వాలని కోరారు.

ఇపుడు మరికాస్తా ముందుకెళ్ళి కాకినాడ సభలో పవన్ రాజకీయాలు వేరు సినిమాలు వేరు, ఇక్కడ హీరోల అభిమానం చూసుకోకుండా అంతా కలసి తనకు మద్దతు ఇవ్వాలని తాను ఏపీని అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరుతున్నారు. నిజంగా సినిమా హీరోలందరూ జనసేనకు మద్దతు ఇస్తారా అలా జరుగుతుందా అన్న చర్చ వస్తోంది.

ముందుగా అభిమానులు మద్దతు ఇవ్వాలని పవన్ కోరుతున్నారు కానీ దాని వెనక హీరోలు కూడా మద్దతు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉంది అంటున్నారు. నేను ఏడాదికి ఓక్టో రెండో సినిమాలు చేస్తానని పవన్ చెబుతూ అందరు హీరోలు కలిస్తేనే సినిమా రంగం అని అన్నారు.

ఇక సినిమాలు రాజకీయాలను వేరుగా చూడాలని, రాష్ట్రభివృద్ధికి అంతా కలసి రావాలని ఆయన అప్పీలు చేసతున్నారు. దీన్ని బట్టి చూస్తే టాలీవుడ్ నుంచి పార్టీ పెట్టి రాజకీయాల్లో అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ కి మొత్తం టాలీవుడ్ మద్దతు ఇవ్వాలన్న విన్నపం అయితే జనసేన వైపు నుంచి వస్తున్నట్లుగా ఉంది. వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో టాలీవుడ్ కొంత ఇబ్బంది పడింది అన్నది కూడా దృష్టిలో ఉంచుకునేలా సీఎం అందరినీ దండం పెట్టించుకున్నారు అన్న డైలాగులు పవన్ వాడుతున్నారు.

అయితే సినిమా రంగం అన్నది సున్నితమైన ఫీల్డ్. అక్కడ అంతా ఒక్కటిగా ఉంటారు. రాజకీయాలు పార్టీలు దరి చేరనివ్వరు. ఇక మరో పెద్ద పార్టీ టీడీపీతో సన్నిహితంగా ఉన్న వారు సైతం పెద్దగా బయట పడరు. మరి అలాంటి టాలీవుడ్ పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇస్తుందా. ఇస్తే కనుక అది అద్భుతమే అవుతుంది. పవన్ మాత్రం వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నారని అంటున్నారు.