Begin typing your search above and press return to search.

పవన్ మరచిన గాజు గ్లాస్..?

By:  Tupaki Desk   |   18 Jun 2023 1:23 PM GMT
పవన్ మరచిన గాజు గ్లాస్..?
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేళ్ళుగా పార్టీని నడుపుతున్నారు. కానీ ట్రెడిషనల్ పాలిటిక్స్ కి అది పూర్తిగా భిన్నంగా సాగుతోంది అని అంటున్నారు. ఎవరైనా పార్టీ పెడితే వెంటనే పోటీ చేస్తారు. అలా 2002లో కేసీయార్ టీయారెస్ ని పెట్టి సిద్ధి పేట ఉప ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తరువాత పార్టీని విస్తరించారు. జగన్ కూడా 2011లో మేలో జరిగిన కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే సీట్లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఫ్యాన్ గుర్తుని ఆయన ఎంచుకుని దాన్ని పార్టీ కామన్ సింబల్ గా చేసుకున్నారు.

ఇక పవన్ విషయమే విచిత్రంగా మారింది. 2014 మార్చి 14న ఆయన పార్టీని ప్రకటించారు. పోటీ చేసేందుకు సమయం లేదని ఈ రోజుకీ చెబుతారు. కానీ పవన్ కనీసం తన వరకైనా పోటీ చేసి ఉంటే ఈ పాటికి జనసేన దశ మరోలా ఉండేదని అంటున్నారు. అలా అయిదేళ్లు వేస్ట్ అయ్యాయి. 2019లో పవన్ 137 సీట్లకు పోటీ చేస్తూ అపుడు గుర్తుకుని తెచ్చుకున్నారు. అదే గాజు గ్లాస్.

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక రాజకీయ పార్టీకి కామన్ సింబల్ దక్కాలీ అంటే కనీసం రెండు ఎమ్మెల్యే సీట్లతో పాటు ఆరు శాతం ఓట్లు దక్కాలి. పవన్ పార్టీకి ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే దక్కడంతో కామన్ సింబల్ పోయింది. ఇక లేటెస్ట్ గా కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఏపీతో పాటు జాతీయ స్థాయిలో పార్టీలకు కామన్ గుర్తులను కేటాయించింది.

అలా చూస్తే ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలకు మాత్రమే కామన్ గుర్తు వచ్చింది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు లేదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. దాన్ని ఫ్రీ సింబల్స్ కేటగిరీతో చేర్చింది. ఈ పరిణామంతో గాజు గ్లాస్ గుర్తు జనసేనకు లేకుండా పోయింది అని అంటున్నారు.

అయితే జనసేన దీని మీద కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. అయితే జనసేన పెట్టుకున్న అభ్యర్ధనను ఈసీ తిరస్కరించింది అని అంటున్నారు. మళ్లీ కామన్ సింబల్ జనసేనకు కేటాయించే విషయం 2025 చివరిలోనే పరిశీలిస్తామని పేర్కొంది అని అంటున్నారు. అప్పటిదాకా కామన్ సింబల్ లేకుండా జనసేన ఉండాల్సిందేనా అన్న చర్చ అయితే సాగుతోంది.

ఇక కామన్ సింబల్ అంటే ఇపుడు దాన్ని నియోజకవర్గాలలో పోటీ చేసే రిజిష్టర్ పార్టీ అభ్యర్ధులతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కూడా కోరుకోవచ్చు. ఈసీ వారికి కేటాయించవచ్చు. రెండేళ్ల క్రితం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుని ఈసీ అలా కేటాయించింది. దాంతో జనసేనకు ఇది ఇబ్బందే అంటున్నారు.

వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీకి వస్తాను అని పవన్ అంటున్నారు. తాను సీఎం అవుతాను అని చెబుతున్నారు. మరి పవన్ ప్రచారం బాగుంది. ఆయన ఆలోచనలు ఓకే, వ్యూహాలు ఓకే. కానీ పార్టీకి కామన్ సింబల్ విషయం ఏంటి అన్నదే చర్చగా ఉంది. కామన్ సింబల్ గాజు గ్లాస్ ని పవన్ మరచారా అన్నదే చర్చగా వుంది.

ఈ విషయాన్ని వైసీపీ మంత్రులు నేతలు గుర్తు చేస్తున్నారు. ముందు గాజు గ్లాస్ గుర్తు సంగతి చూసుకో అని సెటైర్లు వేస్తున్నారు. రేపటి ఎన్నికల్లో పవన్ కి వేరే గుర్తు ఇచ్చినా అది ప్రచారం చేసుకోవడం ఒక కసరత్తుగా ఉంటుంది. ఇక గాజు గ్లాస్ అంటే జనసేన అని ఇప్పటికే ప్రచారంలో ఉంది. దాంతో ఆ గుర్తు అనుకుని జనసేనకు ఓటేసే వారు ఉంటే కచ్చితంగా అలా ఓట్ల చీలిక భారీగా ఉంటుంది. అది అధికార వైసీపీకి ప్లస్ అవుతుందని అంటున్నారు.

ఏది ఏమైనా దేశంలో పార్టీలు పెట్టిన ఏ రాజకీయ నాయకునికీ లేనన్ని ఇబ్బందులు జనసేనకే వస్తున్నాయంటే ఆలోచించుకోవాల్సిందే అంటున్నారు. జనసేన అధినాయకత్వం అసలు విషయాల మీద సంస్థాగతంగా పార్టీని నిర్మించే విషయం మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపూ ప్రత్యర్ధులకు సవాల్ చేస్తూ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తూ పోవడం వల్లనే ఈ చిక్కులు అంటున్నారు. రాజకీయాన్ని సీరియస్ గా చేస్తున్నామని ఇటీవల మీడియాతో చెప్పిన పవన్ ముందు గాజు గ్లాస్ ని ఎలా దక్కించుకోవాలన్న దాని మీద సీరియస్ గా ఫోకస్ పెట్టారా అన్నదే ప్రశ్నగా వస్తోంది.