Begin typing your search above and press return to search.

వైసీపీ రహిత గోదావరే లక్ష్యం... తనకు ప్రాణహాని ఉందన్న పవన్!

By:  Tupaki Desk   |   18 Jun 2023 11:29 AM GMT
వైసీపీ రహిత గోదావరే లక్ష్యం... తనకు ప్రాణహాని ఉందన్న పవన్!
X
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టినప్పటినుంచి ఈ వేడి మరీ తీవ్రమవుతుంది. ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రస్తుతం జనసైనికుల్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.

అవును... తనకు ప్రాణహాని ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తన కోసం కొందరు కిరాయి హంతకులను నియమించినట్లు సమాచారం ఉందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా నియమాలు పాటించాలని ఈ సందర్భంగా పవన్ సూచించారు.

కొంతమంది అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని పవన్ తెలిపారు. గతంలో 2019 ఎన్నికల్లో "ఈసారి వైసీపీ రాకపోతే ఈ పవన్ కళ్యాణ్ ని చంపేదాం" అనే రికార్డింగ్స్ తన వద్ద ఉన్నాయని, ఇంటిలిజెంట్స్ వాళ్లు ఇలాంటివి తనకు పంపించేవారని పవన్ తెలిపారు. ఇవన్నీ తట్టుకుని తాను ఉన్నది ప్రజాస్వామ్యం పై తనకున్న నమ్మకంవల్లే అని పవన్ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా తన సెక్యూరిటీ గురించి మాట్లాడిన పవన్... తనకు ఒకప్పుడు వై కేటగిరీ సెక్యూరిటీ ఉండేదని అయితే తనకు అవసరం లేదని పంపించేశానని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీ కంటే ప్రాణమిచ్చే జనసైనికులనే తాను నమ్ముకున్నానని తెలిపారు.

అనంతరం "మీకెవరికీ లైఫ్ థ్రెట్ లేదు.. నాకుంది. బుల్లెట్ తీసుకోగలరా నాకోసం.. నా సెక్యూరిటీ తీసుకుంటుంది. అందుకే సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ని చాలా పద్దతిగా ఫాలో అవ్వండి. తుపాకులు కాపాడలేకపోవచ్చేమో కానీ ధైర్యం ఉన్న ఒక గుండె కాపాడుతుంది. నాకు ధైర్యం ఉన్న గుండే నా సెక్యూరిటీ" అని వ్యాఖ్యానించారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శనివారం రాత్రి జరిగిన పార్టీ అంతర్గత సమీక్ష సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ బలంగా ఎదుగుతోందని, వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుతుందని పవన్ ఈ సందర్భంగా ప్రకటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గద్దె దింపడమే ఆ పార్టీ ప్రధాన లక్ష్యం అని పవన్ తెలిపారు. ఈ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కేడర్ కు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు జనసైనికులు, వీరమహిళలపై చేసిన భౌతిక దాడులను గుర్తుచేసిన ఆయన... ఆ విషయాలు ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. ఆ సమయంలో పార్టీ గట్టిగా ప్రతీకారం తీర్చుకోలేకపోయిందని అంగీకరించిన పవన్.. బలమైన ప్రణాళికలు లేకపోవడమే దీనికి కారణమని తెలిపారు. త్వరలో వారికి సరైన కౌంటర్ ఇచ్చే సమయం వస్తుందని కేడర్ కు ధైర్యం చెప్పారు.

ఇక మరోవైపు పవన్ కొత్త స్లోగన్ ఎత్తుకున్నారు. వైసీపీ రహిత గోదావరి జిల్లాలే లక్ష్యం కావాలని నేతలకు సూచించారు. గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి రాకూడదని గోదావరి జిల్లాల్లోని నాయకులు, కార్యకర్తలకు ఈ సందర్భంగా పవన్ పిలుపునిచ్చారు.

ఈ లక్ష్యసాధన కోసం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పవన్ కోరారు. తాను సినీ నటుడిని కాకపోతే మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లేవాడినని.. ప్రజల్లోకి వెళ్లేందుకు అభిమానులు, పెద్ద ఎత్తున జనాలు అడ్డుకుంటున్నారని పవన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం!