Begin typing your search above and press return to search.

కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ దిశగా పవన్ పదేళ్ల ప్రసంగాల జర్నీ

By:  Tupaki Desk   |   18 Jun 2023 5:00 AM GMT
కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ దిశగా పవన్ పదేళ్ల ప్రసంగాల జర్నీ
X
సగటు రాజకీయ నాయకుడి తీరు జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో కనిపించవు. ఆయన మాటలు వింటున్నంతనే స్నేహితుడు మాట్లాడే మాటల్లా.. ఒక ఆత్మీయుడి మాటల మాదిరిలా కనిపిస్తాయి. సగటురాజకీయ నేతలకు భిన్నంగా ఆయన మాటలు ఉంటాయి. సమకాలీన రాజకీయాల్లో ప్రజల్ని రంజింపచేసేలా మాట్లాడే విషయంలో పవన్ కాస్త వెనకబడే ఉంటారని చెప్పాలి. ఎందుకుంటే.. ఆయన ప్రస్తావించే చాలామంది చారిత్రక వ్యక్తుల గురించి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులుగా చెప్పుకునే చాలామందికి అవగాహన ఉండదనే చెప్పాలి.

అయితే.. పవన్ ప్రసంగాల్లో ఉండే అతి పెద్దలోపం.. చెప్పాల్సిన విషయాన్ని చెప్పాల్సిన రీతిలో చెప్పరు. ఒకవేళ చెప్పినా.. వాటిలో కంటిన్యుటి దెబ్బ తినేలా ఉంటుంది.అయితే.. ఈ లోపాన్ని ఆయన నెమ్మది నెమ్మదిగా తగ్గించుకోవటం కనిపిస్తుంది. గడిచిన పదేళ్ల కాలంలో చూస్తే.. పవన్ ప్రసంగాల్లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. మొదట్లో అవసరానికి మించిన ఆవేశం.. పదే పదే కొన్ని మాటల్ని ప్రస్తావించటం.. విషయాల పట్ల క్లారిటీ ఉన్నా.. తెలిసిన విషయాల్ని తెలిసినట్లుగా చెప్పే విషయంలో ఆయన కన్ఫ్యూజన్ కు గురయ్యేవారు. దీంతో.. అతుకుల బొంతగా ఉండేది.

పదేళ్లలో ఈ లోపాన్నిపవన్ కల్యాణ్ దాదాపుగా తగ్గించుకున్నారనే చెప్పాలి. గతంలో పోలిస్తే ఆయన ప్రసంగించే తీరులో చాలానే మార్పు వచ్చింది. పవన్ లో మరో పెద్ద లోపం.. ఆయన ప్రసంగంలోని మాటల్ని చెప్పే క్రమంలో కొన్ని మాటల్ని మింగేయటం కనిపిస్తుంది. అయితే.. ఇటీవల కాలంలో ఆ లోపాన్ని ఆయన సవరించుకున్నారనే చెప్పాలి. ప్రజా సమస్యల మీద పట్టు పెరగటంతో పాటు.. తాను లక్ష్యంగా చేసుకున్న వైసీపీ నేతల్ని చీల్చి చెండాడే విషయంలో ఆయన అంతకంతకూ రాటు దేలుతున్నారు.

గతంలో ఏదైనా సీరియస్ వ్యాఖ్య చేయాల్సి వస్తే.. సదరు నేత పేరు ప్రస్తావించకుండా విషయాల్ని చెప్పే వారు. అందుకు భిన్నంగా తాజాగా చేస్తున్న వారాహి విజయయాత్రను చూస్తే.. తాను చేసే సీరియస్ వ్యాఖ్యలకు సంబంధించిన ఆయన క్లియర్ గా చెప్పటమే కాదు.. తాను విమర్శలు చేస్తున్న నేతల పేర్లను చెప్పేస్తున్నారు. పిఠాపురంలో నిర్వహించిన సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఇసుక దోపిడీ గురించి ప్రస్తావించటం తెలిసిందే. ఈ సందర్భంగ ఆయన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సీరియస్ ఆరోపణ చేశారు. ''వైసీపీ పాలనలో కేవలం ఇసుక దోపిడీపైనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏటా రూ.10 వేల కోట్లు సంపాదిస్తున్నారు'' అంటూ ఘాటు ఆరోపణ చేశారు.

పదేళ్ల కాలంలో పవన్ ప్రసంగాల్లో వచ్చిన మరో కీలకమైన మార్పు.. తన సినిమాలకు సంబంధించిన వివరాల్ని.. విశేషాల్ని సుదీర్ఘం కాకుండా కాస్తంత క్రిస్ప్ గా చేసి చెబుతున్నారు. అయితే.. తన ప్రసంగంలో రెండుమూడు సందర్భాల్లో అయినా తన సినిమా విశేషాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. మొదట్నించి ఉన్న లోపం.. ఇప్పటికి వెంటాడుతున్న లోపాల్లో ముఖ్యమైనది.. కీలక వ్యాఖ్యల పట్ల కేర్ ఫుల్ గా ఉండటం. ముఖ్యమంత్రి పదవిని స్వీకరించేందుకు తాను సిద్దమన్న పవన్ కల్యాణ్.. గతంలో తనకు పదవుల కంటే కూడా ప్రజలకు అండగా నిలవటమే ముఖ్యమని చెప్పేవారు.

తాజా వారాహి విజయాత్రలోనూ.. తన ఎజెండా సీఎం పదవే అయినప్పుడు మరింత క్లారిటీతో చెప్పాల్సిన అవసరం ఉంది. జనసేన అధికారిక ప్రెస్ నోట్ లోనూ.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు సిద్ధమని హెడ్డింగ్ పెట్టి పంపినప్పటికీ.. అందులో పవన్ వ్యాఖ్యను జాగ్రత్తగా చూస్తే.. స్పష్టత కనిపించదు. ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేసే ముందు వెనుకా ముందు చూసుకోవాలే తప్పించి.. అదాటున మాట్లాడేయటం వల్ల ప్రయోజనం ఉండదు. తర్వాతిరోజుల్లో ఆ వ్యాఖ్యలకు కట్టుబడలేని పరిస్థితుల్లో అభాసుపాలు కావటం ఖాయం. మొత్తంగా చూస్తే.. పదేళ్ల పవన్ ప్రసంగాలు పాస్ మార్కులు దాటేసి.. డిస్టింక్షన్ దిశగా వెళుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నది నిజం.