Begin typing your search above and press return to search.

‘జనవాణి’ అలా పుట్టింది.. ఎమోషన్ అయిన పవన్

By:  Tupaki Desk   |   17 Jun 2023 2:00 PM GMT
‘జనవాణి’ అలా పుట్టింది.. ఎమోషన్ అయిన పవన్
X
వారాహి విజయ యాత్ర పేరుతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన షెడ్యూల్ లో భాగంగా వివిధ వర్గాల్ని కలుస్తున్నారు. రెండు రోజులకు ఒకసారి వారాహి వాహనం మీదనే సభను పెడుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తన ఆశల్ని.. ఆశయాల్ని.. కలల్ని.. ప్రజలతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన పర్యటనలో భాగంగా 'జనవాణి' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

వివిధ వర్గాలకు చెందిన వారి సమస్యలకు సంబంధించిన పిటిషన్లను స్వీకరించి.. వారికి తగు న్యాయం చేసేలా ప్రయత్నం చేస్తానని ఆయన చెబుతున్నారు. తాను చేపట్టిన జనవాణి కార్యక్రమానికి అసలు కారణాన్ని ఆయన పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమోషన్ అవుతున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా ప్రజల నుంచి 32 ఆర్జీలను స్వీకరించారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా తాను చేపట్టిన జనవాణి కార్యక్రమానికి కారణం ఉందన్న ఆయన.. ''గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతానికిచెందిన ఒక మహిళ నా దగ్గరకు వచ్చింది. తన సమస్యను చెప్పుకుంది. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లే రోడ్డును వెడల్పు చేయటం కోసం ఆ మహిళ నివసించే ఇంటిని కొట్టేశారు. పరిహారం ఇవ్వలేదు. ఈ విషయాన్ని నాకు చెబితే.. నేను మాట్లాడతానని మాటిచ్చాను. ఇది జరిగిన పది రోజుల తర్వాత మళ్లీ అదే మహిళా మా పార్టీ కార్యాలయం వద్ద కనిపించారు. జనంలో నిలుచుంటే నేనే దగ్గరకు పిలిచాను. అన్నయ్య.. మీతో మాట్లాడాలంది. ఏమైంది తల్లీ అని అడిగితే.. నాకు వినతిపత్రం ఇచ్చిన తర్వాతి నుంచి వైసీపీ నేతలు వారిని వేధించటం మొదలుపెట్టారు. ఇంట్లోకి కూరగాయలు తీసుకురావటానికి బయటకు వెళ్లిన ఆ మహిళ అన్న కనిపించకుండా పోయాడు. మూడు రోజుల తర్వాత ఆటోలో శవంగా తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు. నన్ను కలిశారన్నఒక్క కారణంగా ఆ కుటుంబాన్ని వైసీపీ నేతలు సర్వనాశనం చేశారు. ఆ ఆడబిడ్డ ఆవేదన.. కన్నీటి తడి నుంచే జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించే ఆలోచన వచ్చింది'' అంటూ ఎమోషన్ అయ్యారు.

ప్రజలు చైతన్యంగా లేకుంటే అరాచక పాలన రాజ్యమేలుతుందన్న పవన్ కల్యాణ్.. అలాంటి అరాచకాల్ని ఎదుర్కోవటానికే జనవాణి కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా చెప్పారు. బిడ్డకు చికిత్స చేయించుకోవటానికి పోరాడుతున్న ఆరుద్రను పిచ్చిదానిగా ముద్ర వేసే ప్రయత్నం చేశారు. గతంలో మాస్కులు లేవన్న డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడి ముద్ర వేసి.. ఆయన చావుకు కారణమయ్యారన్నారు.