Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తా

By:  Tupaki Desk   |   15 Jun 2023 10:06 AM GMT
అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తా
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో ఒక విచిత్రమైన కోణం కనిపిస్తుంటుంది. అదేమంటే.. కొన్నిసార్లు పదవుల మీద తనకు ప్రత్యేకమైన ఆశ లేదన్నట్లుగా మాటలు చెబుతారు. మళ్లీ అదే పవన్.. మరికొన్నిసార్లు మాత్రం బలంగా పదవులు కావాలన్న అభిలాషను వ్యక్తం చేస్తారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం పోరాటం మాత్రమే సరిపోదని.. ఎన్నికల రణంలో విజయం తప్పనిసరి అన్న విషయం రాజకీయం తెలిసిన పిల్లాడికి సైతం క్లారిటీ ఉంటుంది. కానీ.. రాజకీయ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా తనకు ప్రజలు.. వారి సమస్యల్ని పరిష్కరించటమే ముఖ్యమని చెబుతారు.

మీరు నన్ను గెలిపించినా.. ఓడించినా.. తాను ప్రజల వెంటే ఉంటానని.. తనకు పదవులు పెద్ద విషయం కాదన్నట్లుగా చెబుతారు. అలాంటి పవన్ మళ్లీ.. ఈసారి ఎలా అయినా ఎన్నికల్లో గెలుస్తానని.. ఎవడు అడ్డుకుంటాడో చూస్తానని వ్యాఖ్యానిస్తారు. ఎన్నికల్లో గెలుపు మీద అంత పట్టుదల ఉన్నప్పుడు.. గెలుపోటములు తనకు ముఖ్యం కాదని.. ప్రజల వెంట.. వారికి అండగా ఉండటం కోసమే తాను రాజకీయాలు చేస్తున్నట్లుగా చెప్పే మాటలకు అర్థమేమిటి? అన్నది ప్రశ్న.

తాజాగా కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే కావాలన్న అభిలాషను బలంగా వినిపించారు. అందులో భాగంగా ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి పదం చాలా కీలకమైనదని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటివరకు పవన్ నోటి నుంచి పదవుల గురించి ఇంత బలంగా మాట్లాడింది లేదు. తొలిసారి.. ఎన్నికల్లో తాను ఎట్టి పరిస్థితుల్లో అయినా గెలవాల్సిందేనన్న పట్టుదల.. పంతం కనిపించటం కనిపిస్తుంది.

అందుకు తగ్గట్లే పవన్ మాటలు ఉన్నాయి. ''నేను అసెంబ్లీలోకి రాకూడదనే కక్ష కట్టి ఓడించారు. ఈసారి అసెంబ్లీలో కచ్ఛితంగా అడుగుపెడతా. దాని కోసం ఎన్ని వ్యూహాలైనా వేస్తాం. అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తా'' అంటూ ఎన్నికల్లో గెలుపు మీద తానెంత పట్టుదలతో ఉన్నానన్న విషయాన్ని ఆయన చెప్పేశారని చెప్పాలి. కత్తిపూడిలో పవన్ మాటల్ని చూస్తే.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే చోట గెలుపుకు అవసరమైన అన్నీ వ్యూహాలను అమలు చేస్తారన్న విషయం అర్థమవుతుంది. అదే జరిగితే..ఈసారి పోరు మరింత రంజుగా ఉంటుందని చెప్పక తప్పదు.