Begin typing your search above and press return to search.

పవన్ నోట మళ్లీ ముందస్తు మాట

By:  Tupaki Desk   |   15 Jun 2023 9:40 AM GMT
పవన్ నోట మళ్లీ ముందస్తు మాట
X
ఎన్నికలు ఎప్పుడు వచ్చేవన్న విషయంలో మిగిలిన వారి కంటే ఎక్కువగా.. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రిగా అవగాహన ఉంటుంది. ఎందుకంటే.. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగాలా? లేదంటే.. ముందుగా జరగాలా? అన్నది ఆయనదే తుది నిర్ణయం. షెడ్యూల్ ప్రకారం జరిగేందుకు ఆయన ప్రత్యేకంగా చేయాల్సింది ఏమీ ఉండదు. కానీ.. ముందస్తు విషయంలో మాత్రం ఆయన నిర్ణయానికి తగినట్లే ఉంటుంది. మరి.. విషయం ఇంత క్లారిటీగా ఉన్నప్పటికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు వస్తాయని చెప్పారు. కొద్దిరోజుల క్రితం నిర్వహించిన కేబినెట్ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని.. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేయటం తెలిసిందే. అయినప్పటికీ.. పవన్ కల్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా.. ఈ ఏడాది డిసెంబరులోనే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని చెప్పటం విశేషం.

కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ''ఈసారి సార్వత్రిక ఎన్నికలు నవంబరు.. డిసెంబరులో వచ్చే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి చెప్పినా.. అలా ఏమీ జరగదు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంతో వైసీపీ పెద్దలు సంప్రదింపులు పూర్తి చేశాయని సమాచారం'' అని వ్యాఖ్యానించారు. ముందస్తు మీద పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కల్యాణ్.. తాజాగా మళ్లీ అదే మాటను అనటంతో.. ఇప్పుడు మళ్లీ ముందస్తు మీద చర్చ మళ్లిందని చెప్పాలి. ఇక.. కత్తిపూడి సభలో మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఈసారి ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు గోదావరి జిల్లాల వారి చేతుల్లో ఉంటుందన్నారు. యువతరం.. ప్రజలు ఆవేశంతో కాకుండా ఆలోచించి ఓటు వేయాలన్న ఆయన.. తమను ఆదరించాలని కోరటం గమనార్హం.