Begin typing your search above and press return to search.

వైసీపీలో కొత్త అంతర్మధనం? పవన్ ను పట్టించుకోకుండా ఉండాల్సిందా?

By:  Tupaki Desk   |   13 May 2023 7:00 PM GMT
వైసీపీలో కొత్త అంతర్మధనం? పవన్ ను పట్టించుకోకుండా ఉండాల్సిందా?
X
తన దారిన తాను పోయేవాడిని అలా పోనిస్తే సరిపోతుంది. అందుకు భిన్నంగా.. అవసరానికి మించి కెలికి.. కంపు చేసుకున్న పార్టీ ఒకటి. తన మానాన తాను పోతుంటే.. తనను కెలికినోడి అంతు చూసే వరకు నిద్రపోనని శపథం చేసి మరీ లెక్కలు తేల్చే వేళలో పనిలో పడిన పార్టీ మరోటి. ఆ రెండూ వైసీపీ - జనసేన. జనసేనను ఎక్కువ కెలికి తప్పు చేశామా? అని. జనసేన అధినేత పవన్ విషయంలో వైసీపీకి చెందిన కొందరి మాటల్లో వినిపించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గతంలో ఎన్నో ప్రసంగాల్లో సీఎం జగన్ తో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి పంచాయితీ లేదన్న మాటను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు స్పష్టం చేశారు. అదే సమయంలో చంద్రబాబు మీద ప్రత్యేకమైన అభిమానం కూడా లేదని చెప్పటం తెలిసిందే. మరి.. చంద్రబాబుకు దగ్గరై.. జగన్ కు ఎందుకు దూరమైనట్లు? అన్నది ప్రశ్న వేసుకుంటే.. పవన్ ను ఒక స్థాయి దాటేలా కెలికిన క్రెడిట్ వైసీపీ నేతలకే చెల్లుతుంది. తమకు వచ్చిన ఫీడ్ బ్యాక్ తో పాటు.. పవన్ ను అసెస్ చేసే విషయంలో వైసీపీ అధినాయకత్వం చేసిన పొరపాట్లు ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందన్నమాట వినిపిస్తోంది.

ఒకవేళ పవన్ సినిమాల గురించి జగన్ ప్రభుత్వం పట్టించుకోకుండా.. పవన్ కు మూడు పెళ్లిళ్లు అన్నమాట వైసీపీ అధినేత మొదలుకొని పార్టీ నేతల వరకు ప్రతి ఒక్కరు కామెంట్ చేయటం.. ఆర్కే రోజా లాంటి వారు.. చెలరేగిపోవటం.. అంబటి రాంబాబు లాంటోళ్లు వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడటం భారీగా డ్యామేజ్ చేసిందంటున్నారు. ఇక.. పేర్ని నాని.. గుడివాడ అమర్నాధ్ లాంటి వారు పవన్ ను పర్సనల్ గా టార్గెట్ చేయకుండా.. పవన్ విధానాల్లోని లోపాలను వేలెత్తి చూపించేలా వ్యవహరించి ఉంటే.. విషయం ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదన్న భావన వ్యక్తమవుతోంది.

సింఫుల్ గా పోయే దానిని.. ఏదేదో చేసి.. ఎక్కడికో వెళ్లేలా చేశారన్న అభిప్రాయం కొందరి నోట రావటం ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధినేత జగన్ తో తనకు ఎలాంటి పంచాయితీ లేదన్న పవన్ మాటను నమ్మగలమా? అంటే.. వైసీపీకి చెందిన దివంగత మంత్రి గౌతమ్.. మాజీ మంత్రి బాలినేనితో తనకున్న వ్యక్తిగత సంబంధాల గురించి పవన్ ప్రస్తావించటం తెలిసిందే.

సమకాలీన రాజకీయాల్లో ఒక పార్టీ అధినేతగా ఉండి.. మరో పార్టీకి చెందిన కొందరు నేతలతో సన్నిహితంగా ఉండటం.. ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పటం లాంటివి చాలా అరుదు. బాలినేని శ్రీనివాసరావు గురించి చెబుతూ.. రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అంటూ వ్యాఖ్యానించటం.. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ ఆకస్మిక మరణం వేళ.. పవన్ ఎంతలా తల్లిడిల్లారో చూసినప్పుడు.. ఇతర పార్టీలకు చెందిన వారి విషయంలో తానెంత సానుకూలంగా ఉంటానన్న విషయాన్ని చెప్పేశారు. రోటీన్ రాజకీయ నాయకుడికి కాస్తంత భిన్నమైన ధోరణిని ప్రదర్శించే పవన్ ను హ్యాండిల్ చేసే విషయంలో వైసీపీ చేసిన తప్పులు ఇప్పుడు చిక్కులుగా మారాయంటున్నారు.

ఒకవేళ.. పవన్ ను పర్సనల్ గా టార్గెట్ చేయకుండా.. ఆయన్ను రాజకీయనాయకుడిగా కాకుండా సినిమా యాక్టర్ గా గుర్తిస్తూ.. ఆయనకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదల్లో ఎలాంటి లోపం రానివ్వకుండా చూసి ఉంటే ఏం జరిగేది? అలాంటి వేళలోనూ జగన్ మీదా.. జగన్ ప్రభుత్వం మీదా విరుచుకుపడితే.. ఆ మొత్తం జగన్ కు ప్లస్ అయ్యేదే తప్పించి మైనస్ అయ్యేది కాదు కదా? ఒకవేళ.. జగన్ అండ్ కో తన విషయంలో మరీ పట్టుదలకు వెళ్లి.. పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నవైనంతోనే వారి లెక్కలు తేల్చాలన్న పట్టుదల పవన్ కు వచ్చిందంటారు. ఇదంతా చూస్తే.. హ్యాండిల్ విత్ కేర్ అన్నట్లుగా పవన్ విషయంలో వ్యవహరించి ఉంటే.. చంద్రబాబుకు ఆయుధం కాకుండా ఉండేవారన్న మాట వినిపిస్తోంది.