Begin typing your search above and press return to search.

ఎడాపెడా తేల్చేస్తున్న పవన్: అజాత శత్రువుగా ఉండను.. ఉండలేను!

By:  Tupaki Desk   |   13 May 2023 12:14 PM GMT
ఎడాపెడా తేల్చేస్తున్న పవన్: అజాత శత్రువుగా ఉండను.. ఉండలేను!
X
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం ఇవాల్టి రోజుల్లో అంత తేలికైన విషయం కాదు. ఎంత ఓపెన్ గా ఉన్నట్లు చెప్పినా.. ఓపెన్ గా ఉండేందుకు వీలు కాని పరిస్థితులు ఇప్పుడున్నాయి. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ రంగంలో ఉన్న వారు ఓపెన్ గా ఉండటం.. లోపల విషయాల్ని బయట విషయాల్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. అలాంటి తీరును ప్రదర్శించే అతి తక్కువ మంది రాజకీయనేతల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకరు.

పెద్ద దాపరికాలు లేకుండా మాట్లాడేస్తుంటారు పవన్ కల్యాణ్. మీడియా దగ్గర కూడా ఇలాంటి తీరును ప్రదర్శిస్తారు. ప్రశ్న ఏదైనా అడగొచ్చు. పరిమితులు పెట్టరు. ప్రశ్నించినోళ్లను ఎటకారం చేయరు. ఇరుకున పెట్టే ప్రశ్న వేస్తే.. చిరునవ్వుతో రియాక్టు అవుతారే తప్పించి.. ఆవేశంతోనో.. ఆగ్రహంతోనో విరుచుకుపడరు. అడిగే ప్రశ్నలో లక్ష్యం గురించి తెలిసి కూడా.. నిజాయితీగా సమాధానం ఇచ్చేప్రయత్నం చేస్తారే కానీ ఇరిటేట్ కాని గుణం కనిపిస్తుంది.

పార్టీ నేతలతో తాజాగా ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడు.. కొన్ని అంశాల వద్ద తన స్టాండ్ ను చెప్పేందుకు ఆయనలో మొహమాటం అన్నది పడని తత్త్వం కనిపిస్తుంది. అలాంటి మాటలే కొన్ని ఆయన నోటి నుంచి వచ్చాయి. తాను అజాత శత్రవుగా ఉండటానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. 'మెజార్టీ ప్రజలను రక్షించటానికి.. ఏపీని డెవలప్ చేసే క్రమంలో కొందరికి శత్రువును అవుతా. నేను మీకు శత్రవునే. మిమ్మల్ని చూసి భయపడను. జీరోబడ్జెట్ రాజకీయాలు అని నేనెప్పుడూ అనలేదు. ఓట్లు కొనని రాజకీయాల గురించి ప్రస్తావించా. రాజకీయాలకు కొంత డబ్బు అవసరమే. నేను పార్టీ కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు చేస్తున్నా' అని స్పష్టం చేశారు.

పవన్ మాటల్ని చూసినప్పుడు.. ప్రతి విషయంలోనూ ఆయన ఫుల్ క్లారిటీగా ఉన్నారన్న విషయం స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలన్న తన ఆశకు ఉన్న పరిమితుల గురించి తనకున్న క్లారిటీని చెప్పేయటం ద్వారా.. తనను అభిమానించి.. ఆరాధించే వారికి మరింత క్లారిటీ ఇచ్చారని చెప్పాలి. అదే సమయంలో.. తాను ఇప్పటికి తగ్గినా.. ఏదో ఒక రోజు తనదైన టైంలో తనకు తగ్గట్లే రియాక్టు అవుతానన్న విషయాన్ని పవన్ చెప్పేశారు.