Begin typing your search above and press return to search.

ఏసీ రూంలో కూర్చోబెట్టి లీడర్లకు ఇలా క్లాస్ పీకటం పవన్ కే సాధ్యం

By:  Tupaki Desk   |   13 May 2023 10:00 AM GMT
ఏసీ రూంలో కూర్చోబెట్టి లీడర్లకు ఇలా క్లాస్ పీకటం పవన్ కే సాధ్యం
X
విషయం ఏమైనా తమ అంతర్గత వ్యవహారంగా.. బయటకు రాకూడని అంశాలుగా చెబుతూ.. మీడియాకు అనుమతుల్ని పరిమితం చేస్తున్న కాలమిది. ప్రజల డబ్బులతో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం మీడియాను రానివ్వని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి రోజుల్లో ఏదైనా.. ఉన్నది ఉన్నట్లు అందరికి తెలియాలి. దాపరికం ఏదీ లేదు. అంతా ఓపెనే అన్నట్లుగా వ్యవహరించటంఅంత తేలికైన విషయం కాదు. ఈ తీరులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పోటీ వచ్చేవారే ఉండరేమో?

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏపీలోని అన్ని నియోజకవర్గాలు.. పట్టణాలు.. మండలాల పార్టీ అధ్యక్షులు.. ఇతర నాయకులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఏసీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించారు. వారి ముందు ప్రసంగించిన పవన్ కల్యాణ్.. తన ప్రసంగం చివర్లో సంచలన విషయాల్ని చెప్పుకొచ్చారు. అయితే.. ఈ వ్యాఖ్యలన్ని పార్టీ నేతలకు క్లాస్ పీకినట్లుగా ఉండటం గమనార్హం. సాధారణంగా ఇలాంటి వాటిని ఇన్ కెమెరా అన్నట్లుగా చేస్తారు. కానీ.. పవన్ మాత్రం అంతా ఓపెనే.. రహస్యాలు అంటూ ఏమీ ఉండవన్నట్లుగా వ్యవహరించిన తీరు చర్చగా మారింది.

సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయటంపై పవన్ తాను అనుకుంటున్న విషయాల్ని చెప్పటమే కాదు.. ముఖ్యమంత్రి పదవిని ఎవరు ఎందుకు ఇస్తారు? అంటూ ప్రశ్నించారు. పార్టీకి ఉన్న బలం గురించి ఓపెన్ గా చెప్పేయటం.. మధ్యలో కొందరు పవన్ చెప్పిన అంకెల్నిసరిచేస్తూ.. ఎక్కువ చేసి చెబుతున్నా.. కాదు.. అది కరెక్టు కాదంటూ సరి చేస్తూ.. తక్కువ ఫిగర్ నే పవన్ చెప్పటం కనిపిస్తుంది. అంతేకాదు.. పొత్తు ఉండొద్దని.. పొత్తు ఉంటే తనను ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ నేతలు చేస్తున్న వాదనపై క్లాస్ పీకారు.

ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్పిన పవన్ తీరు చూస్తే.. ఈ స్థాయి రాజకీయ పరిణితి ఇటీవల కాలంలో మరే నేతలోనూ కనిపించదని చెప్పాలి. పార్టీకి వెన్నుముకలా ఉండే పార్టీ నేతలు.. కార్యవర్గాన్ని ఈ స్థాయిలో క్లాస్ పీకటం మామూలు విషయం కాదని చెప్పాలి. ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే తప్పించి పొత్తు ఉండకూడదని తమ పార్టీ నేతలు చెప్పే మాటల్లోని డొల్లతనాన్ని పవన్ చెప్పిన వైనం అందరిని ఆకర్షించటమే కాదు.. వాస్తవానికి దగ్గరగా పవన్ ఆలోచనలు ఉన్నాయంటున్నారు.

ఈ సందర్భంగాపవన్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన మాటల్లోనే చదివితే.. విషయం మరింత క్లియర్ గా అర్థమవుతుంది. పవన్ మైండ్ సెట్ ఏమిటో తెలుసుకునే అవకాశం చిక్కుతుంది. ''ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే తప్ప పొత్తు పొడకూడదని మన నాయకుడు కొందరు చెబుతుంటారు. అందుకు ఎవరు అంగీకరిస్తారు? మండల.. డివిజన్ స్థాయి నాయకులు మీరు. మిమ్మల్ని ఎవరైనా అలా ఉండాలని కోరుకుంటారా? పక్కవారు అలా ఉండాలని మీరు భావిస్తారా? మండల స్థాయిలో ఉన్న నాయకుడే తాను పదవిలో ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నప్పుడు.. ఒక పార్టీ అధినేత మరో పార్టీ అధినేతను ముఖ్యమంత్రి చేద్దామని ఎందుకు అనుకుంటారు? ఆ దిశగా ఆలోచించాలి. అవసరమైనప్పుడు తగ్గాలి. మరోసారి బెబ్బులిలా తిరగబడాలి. రాజకీయాల్లో రెండూ ముఖ్యమే. మజ్లిస్ పార్టీలా ఏడు స్థానాల్లో కూడా గెలిపించలేదుకదా? విజయకాంత్ లా కూడా గెలిపించలేదు కదా? ఎంఐఎంకు ఉన్న ఏడుస్థానాలకు ఎంత ప్రాధాన్యత ఉందో గమనించండి. టీఆర్ఎస్ కూడా పొత్తులతోనే ఈ స్థాయికి ఎదిగింది'' అంటూ ఉదాహరణలో సహా క్లాస్ పీకిన పవన్ తీరు చూస్తే.. సమకాలీన రాజకీయాల్లో ఇంత ఓపెన్ గా మాట్లాడటం మరే పార్టీ అధినేతకు సాధ్యం కాదేమో? అన్నభావన కలుగక మానదు.